
చేయని తప్పుకు శిక్ష అనుభవించడం అంటే ఇదే. చేయని పెళ్లికి పెట్టిన ఖర్చు వృథా అయితే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నిర్వహించని కార్యక్రమానికి రూ.1.12 కోట్లు ఖర్చు చేయడం సామాన్యమైన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ లో అసలు జీతాలకే నిధులు లేకపోగా చేయని పనులకు ఖర్చు చేసి మరింత అప్పుల్లోకి కూరుకుపోయే ప్రమాదంలో పడిపోతున్నారు. తిరుపతిలో ఇటీవల ఓ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తీరా సమయానికి మీటింగ్ రద్దు కావడంతో దానికి పెట్టిన ఖర్చు మీద పడింది.
తిరుపతిలో దక్షిణాది స్టేట్ల ప్రాంతీయ మండలి సమావేశం మూడు నెలల కిందట నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఏర్పాట్లు చేయాలని రాష్ర్ట ప్రభుత్వానికి సూచించారు. దక్షిణాది నుంచి అన్ని స్టేట్ల నుంచి ముఖ్యమంత్రులు హాజరవుతారని తెలియడంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ. 4 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కాంట్రాక్టర్ ను పిలిపించి పనులు అప్పగించారు. దీంతో ఆయన పనులుపూర్తి చేశారు. చివరికి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో సమావేశం రద్దయింది. కానీ చేసిన పనులకు మాత్రం బిల్లులు చెల్లించక తప్పలేదు. దీంతో సర్కారు మీద భారం పడింది.
సదరు కాంట్రాక్టర్ వైసీపీకి సన్నిహితుడు కావడంతో ఆయన బిల్లుల గురించి అదే పనిగా అడగడంతో చేసేది లేక సర్కారు రూ.1.12 కోట్లు కాంట్రాక్టర్ కు ముట్టజెప్పారు. అసలే రాష్ర్టం అప్పుల్లో ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఈ భారం పడడంతో భరించలేకపోతున్నారు. అప్పుల పాలైన రాష్ర్టంలో ఇలా చేయని పనులకు బిల్లులు చెల్లించాల్సి రావడంతో చేసేది లేక లోలోపలే మథనపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అప్పులప్రదేశ్ గా అవతారమెత్తున్న తరుణంలో ఇబ్బడిముబ్బడిగా అప్పులు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఇలా చేయని పనులకు సైతం బిల్లులు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అప్పులు తీరే మార్గం గురించి ఆలోచిస్తున్నా అదనపు ఖర్చులతోనే కాలం వెళ్లదీయాల్సి రావడం దారుణమే . ఏపీ బాధలు ఎప్పటికి తీరేనో అని అందరు వేచి చూస్తున్నారు.