Road Accidents: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనం సాధారణంగా ఎవరైనా చనిపోయారా అని మొదట అడుగుతాం. తర్వాత వాహనాలు ఎంత డ్యామేజ్ అయ్యాయని ఆరా తీస్తాం.. నష్టం ఎంత అని అంచనా వేస్తారు. ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతాం. అయితే ఒక్క ప్రమాదం.. కోట్లలో నష్టం కలిగిస్తోందని తాజాగా నిర్వహించిన అధ్యయనం తెలిపింది. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్‌ఎఫ్) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే దేశానికి సగటున రూ.4 కోట్ల వరకూ సామాజిక–ఆర్థిక నష్టం సంభవిస్తుందని వెల్లడించింది. ఇది వ్యక్తిగత విషాదం మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ పరోక్షంగా నష్టమని పేర్కొంది. ఈ లెక్కలు కేవలం శారీరక ప్రాణ నష్టాన్ని మాత్రమే ప్రతిబింబించవు. ఆ వ్యక్తి వయసు, కుటుంబం, విద్యా స్థాయి, వృత్తి, భవిష్యత్తులో ఇచ్చే ఉత్పాదక లోబడి సమాజానికి కలిగే నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఖరీదైన నిర్లక్ష్యం..
రహదారి ప్రమాదాలు ఒక్కో కుటుంబానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వృద్ధికీ పెద్ద విఘాతం. నిపుణులు అంచనా ప్రకారం.. ఆసుపత్రి చికిత్సలు, వాహన మరమ్మతులు, బీమా క్లెయిమ్‌లు, ఆదాయం కోల్పోయిన కుటుంబాల ఆర్థిక ప్రభావం కలిపి దేశ జీడీపీలో 1.3–1.5% వరకు నష్టం కలుగుతుంది. రహదారి భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉన్న దేశాల్లో ఈ శాతం మరింతగా ఉంటుందని గ్లోబల్ విశ్లేషణలు చెబుతున్నాయి. గురుగ్రామ్‌కు చెందిన సాంకేతిక నిపుణుడు అఖిలేష్ శ్రీవాత్సవ కూడా ఈ అంశంపై దృష్టి సారిస్తూ, రహదారి ప్రమాదాలు కేవలం వ్యక్తిగతం కాదని, జాతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఆటంకమే అని తెలిపారు.
ప్రమాదం.. కుటుంబానికి తీరని నష్టం..
ఒక కుటుంబ సభ్యుని అనూహ్య మరణం ఆ కుటుంబ ఆర్థిక స్థితిని పూర్తిగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యక్తి మరణిస్తే పిల్లల విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. ఈ ప్రభావం సమాజంలో వృద్ధి అసమానతలను పెంచుతుంది. ఇందుకే రోడ్డు భద్రత కేవలం ట్రాఫిక్ నియమాల పరంగా కాకుండా సమాజ స్థిరత్వానికి ముడిపడ్డ అంశంగా చూడాల్సిన అవసరం ఉంది.
అంతర్జాతీయ సూచనలు..
అంతర్జాతీయ రహదారి సమాఖ్య వివిధ దేశాల ప్రభుత్వాలకు స్పష్టమైన సూచనలు చేసింది. ప్రమాదాల డేటాను సాంకేతికంగా విశ్లేషించి, రిస్క్ జోన్లను గుర్తించాలని తెలిపింది. రహదారుల డిజైన్, లైటింగ్, డ్రైవింగ్ ప్రమాణాలపై లోకల్ ఇంజినీరింగ్ సవరణలు చేయాలని సూచించింది. ప్రజల్లో భద్రతా అవగాహన పెంచేందుకు ఎడ్యుకేషన్, టెక్నాలజీ కలయికతో ప్రచారం చేయాలని పేర్కొంది. ఈ సూచనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పరిశీలనలో ఉన్నాయని, కొన్నింటిని రహదారుల డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఇప్పటికే చేర్చుతున్నారని అంచనా.
మన దేశంలో ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక కోణంలో ఇది తీవ్ర నష్టం. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, 10% ప్రమాదాలు నివారించగలిగినా వేల కోట్లు దేశ జీడీపీలో నిల్వగా మిగులుతాయి. సాంకేతిక పర్యవేక్షణ, గమన నియంత్రణ, రహదారి రూపకల్పనలో ఆధునికతతోనే ప్రమాదాలు తగ్గుతాయిని సూచించారు.