తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంతకాలం కేసీఆర్ ను కట్టడి చేయగలిగితే, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆయనతో స్నేహం పేరుతో ఆయన చెప్పిన్నట్లు నడుచుకొంటున్నారనే విమర్శలకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో ఇప్పుడు పోతిరెడ్డిపాటు ఇద్దరు మధ్య చిచ్చు రాజేస్తున్నది.
రాజకీయంగా పోతిరెడ్డిపాడు కేసీఆర్ – జగన్ లకు కీలకమైన, సున్నితమైన అంశం. వారి వారి ప్రాంత ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశం. ఈ అంశంపై రాజీధోరణి అవలంభిస్తే కాసులకోసం రాజీపడ్డారనే అపనింద పడవలసి వస్తుంది. అందుకు రాజకీయంగా సహితం భారీమూల్యం చెల్లింపవలసి వస్తుంది.
రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు చేపడితే నాడు కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ లోని పి జనార్ధనరెడ్డి, మర్రి శశిధరరెడ్డి వంటి నేతలు సహితం ఉగ్రరూపం దాల్చారు. అది చేబడితే తెలంగాణలో మహాబుబ్ నగర్ ప్రాంతం ఎడారిగా చేస్తుందని గగ్గోలు పెట్టారు.
ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను మరింత విస్తరించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుండటం ఒక విధంగా కేసీఆర్ ను ఇరకాటంలో పడవేసింది. ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ దోస్తీ, ఇద్దరి మధ్య ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రైతులు మండిపడుతున్నారు.
ఏపీ కట్టే ప్రాజెక్టుతో శ్రీశైలం ఖాళీ అవుతుందని.. పాలమూరు, నల్గొండ జిల్లాలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపాలంటూ రాష్ట్ర సర్కారు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
మరోవంక జగన్ కు బలం అంతా రాయలసీమ ప్రాంతం నుండే. వైసిపి ఎమ్యెల్యేలలో అత్యధికులు ఈ ప్రాంతం నుండే ఎన్నికయ్యారు. మూడు సీట్లను తప్ప అన్ని సీట్లను వైసిపి గెల్చుకొంది. అయితే టిడిపి హయాంలో రాయలసీమకు నీరు తీసుకురావడంలో కొంత చంద్రబాబునాయుడు విజయవంతం కావడంతో ఇప్పుడు నీటి సమస్యను చేపట్టాక జగన్ కు తప్పడం లేదు.
కృష్ణా నీటిని రాయలసీమకు తరలించాలనే నిర్ణయం రహస్యంగా ఏమీ జరగలేదు. ఏపీ సీఎంజగన్ బహిరంగంగానే ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ లో కడప జిల్లా పర్యటన సందర్భంగా పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
దానితో కేసీఆర్, జగన్ ల మధ్య లోపాయకారీ ఒప్పందం ఏదో జరిగిన్నట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దానితో కేసీఆర్ స్పందించి కృష్ణా బోర్డు కు ఫిర్యాదు చేయక తప్పదు. అయితే కృష్ణా బోర్డు జలవివాదాలు పరిష్కారంలో ఇప్పటివరకు చెప్పుకోదగిన కృషి చేసిన్నట్లు లేదు.
కృష్ణాలో అదనంగా నీటిని వాడుకొనే ఉద్దేశ్యం లేదని, తమకు హక్కు ఉన్న మేరకే వాడుకుంటామని ఈ సందర్భంగా జగన్ చెబుతున్నా నమ్మశక్యంగా లేదు. ఈ వాదన తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించబోదు.