
Revanth Alleges KCR: ఓట్ల కోసం.. సీట్ల కోసం సీఎం కేసీఆర్ ఎంతదాకా అయినా వస్తాడని.. చేస్తాడని రాజకీయవర్గాల్లో ఓ విమర్శ ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనగానే ఆ నియోజకవర్గంపై కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్ మిగతా నియోజకవర్గాలకు కనీసం కూడా విదిల్చడం లేదని.. అందుకే తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ ఆయా నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది.
సీఎం కేసీఆర్ గత ఏడేళ్లలో చిన్న మూల్కనూర్ నుంచి నేటి వాసాలమర్రి వరకు చాలా గ్రామాలను దత్తత తీసుకున్నాయి. అయితే కొత్తగా తీసుకున్న వాటిని నెత్తిన పెట్టుకొని పాత వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. ఇటీవల తన దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళితులందరికీ దళితబంధును ప్రకటించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. అయితే పాత దత్తత గ్రామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. నిధులు విడుదల చేయడం లేదన్న విమర్శ ఉంది.
ఈ క్రమంలోనే కేసీఆర్ వదిలేసిన పాత దత్తత గ్రామాలపై పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వాటిని హైలెట్ చేసి కేసీఆర్ తీరును ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లి అనే గ్రామం కూడా కేసీఆర్ దత్తత గ్రామమే. సీఎం ప్రవేశపెట్టిన ధరణి వెబ్ సైట్ ను మూడు చింతలపల్లి నుంచే ప్రారంభించారు. కానీ సమస్యలు మాత్రం ఇప్పటీకీ పరిష్కరించిన పాపాన పోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. వాసాలమర్రిని అభివృద్ధి చేసిన కేసీఆర్ పాత చింతలపల్లిని పట్టించుకోవడం లేదని.. ఆ అసంతృప్తిని పీసీసీ చీఫ్ రేవంత్ వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నారు. దళితవాడలను సందర్శించి ప్రజలను సీఎం కేసీఆర్ ఎలా మోసం చేశాడో వివరించనున్నారు. సీఎం దత్తత తీసుకొని సంవత్సరాలు గడుస్తున్నా పల్లెలలో దళిత వాడలనే అభివృద్ధి చేయని సీఎం ఇక దళితబంధును ఎలా ఇస్తారని వారికి చెప్పనున్నారు.
2017లో మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లినే కాకుండా కేశవరం, అక్ష్మాపూర్ గ్రామాలను దత్తత తీసుకున్నారు.. కానీ ఎలాంటి నిధులు, అభివృద్ధి పనులు చేపట్టలేదు. ప్రత్యేకంగా సాయం చేసింది లేదు.
కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లాలోని గ్రామాలు తన ఫాంహౌస్ ఎర్రవెల్లికి వెళ్లే దారిలోనే ఉన్నాయి. కేసీఆర్ అటుగా వెళ్లడానికి ప్రయాణ సౌకర్యం కోసం ఇలా ఈ గ్రామాలను అభివృద్ధి చేశాడని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ దత్తత గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు చేపట్టేందుకు రెడీ అయ్యింది. మేడ్చల్ ఎంపీ కూడా రేవంత్ కావడంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నారు.