తెలంగాణకే అతిపెద్ద కరోనా ఆస్పత్రి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి. తెలంగాణ వ్యాప్తంగా పేదలు, ఇతరులు కూడా ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ప్రభుత్వాసుపత్రి కావడంతో ఇక్కడ కనీస సౌకర్యాలు లేక.. పట్టించుకునే వారు లేక అటు కరోనా రోగులు, వారి కుటుంబాల వారు.. ఇటు గాంధీ ఆస్పత్రి సిబ్బంది సైతం నానా అగచాట్లు పడుతున్నారు. డాక్టర్లు, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదు. గాంధీ ఆస్పత్రిలో అందరూ పడుతున్న బాధను తెలుసుకున్న రేవంత్ రెడ్డి స్పందించాడు.
ఈ శనివారం నుంచి మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉచిత భోజన కార్యక్రమాన్ని గాంధీ ఆస్పత్రిలో ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల కోసం ఆయన ఈ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 1000 మందికి ఇలా ఉచిత భోజనం అందిస్తామని తెలిపారు.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కరోనా రోగులకు తాను ఇలా ఉచిత భోజనం సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా రోగుల కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని.. యూత్ కాంగ్రెస్ తరుఫున ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి గాంధీలో అసలు కనీస సౌకర్యాలు లేవని.. ఎవరి దగ్గర డబ్బులు లేవని రేవంత్ ఆరోపించారు. డాక్టర్లు, నర్సులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదని విమర్శించాడు.
ఇక లాక్ డౌన్ ఉన్నంత వరకు తాము గాంధీ ఎదుట ఉచిత భోజన వసతి కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ టైంలో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చేయలేదని ఎంపీ అన్నారు.
మొత్తంగా కరోనా కల్లోలం రోగులు, వారి బంధువులతో నిండిన గాంధీ ఆస్పత్రిలో లాక్ డౌన్ ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న రోగుల బంధువుల ఆకలి తీర్చేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత బోజనం సౌకర్యంపై బాధితులంతా ప్రశంసలు కురిపించారు. ఇలా మంచి ప్రజాపయోగ కార్యక్రమాలు చేయాలని సూచించారు.