Modi – Revanth Reddy : రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాలకు అనుగుణంగానే నాయకుల అడుగులు ఉంటాయి. అంతేతప్ప కేసీఆర్ చెప్పినట్టు రాజకీయ పార్టీలేమీ శంకరమఠాలు కావు.. అవేమీ ఉదారంగా సేవ చేయవు. ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. అది అవసరాల ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే ఈ లెక్కలను సరి చేసినప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుంది. అలా చేయకుంటే ప్రతిపక్షంగా మిగిలిపోతుంది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అది చేతకాలేదు. 2023లో రేవంత్ రెడ్డి చేసి చూపించాడు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తలవంచుతారు.. జీ హుజూర్ అంటారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముందు చాలామంది నాయకులు అలానే చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి తనదైన కసరత్తు చేస్తున్నారు. పేరుకు గేట్లు ఎత్తలేదు అని చెబుతున్నప్పటికీ.. తెర వెనుక చేయాల్సింది చేసేస్తున్నారు.
నిన్న బిజెపి రెండవ జాబితా ప్రకటించిన తర్వాత.. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి డీకే అరుణ పేరు ప్రకటించిన తర్వాత.. జితేందర్ రెడ్డి అలక బూనారు. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అదునుగా రేవంత్ రెడ్డి స్పందించారు. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా చక్రం తిప్పారు. సీన్ కట్ చేస్తే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి జితేందర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని బిజెపి అధిష్టానం ఆఫర్ ఏమీ ఇవ్వలేదు. కాకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నాయకుడిగా ఆయనకు పేరు ఉంది కాబట్టి.. ఎన్నికల్లో ఉపయోగపడతాడు అని పార్టీ అనుకుంది. కాకపోతే జితేందర్ రెడ్డి తనకు టికెట్ ఇస్తే సత్తా చూపిస్తానని పలుమార్లు ఇటీవల ప్రకటించారు. అయితే అధిష్టానం వద్ద అరుణకు ఉన్నంత పలుకుబడి లేకపోవడంతో టికెట్ దక్కలేదు. ఎదుటి పార్టీలో వ్యతిరేక స్వరం వినిపించినప్పుడు దానిని కచ్చితంగా క్యాచ్ చేయగలగాలి. అలా చేస్తేనే రాజకీయాల్లో సరికొత్త ఎత్తుగడలు సాధ్యమవుతాయి. జితేందర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా? అనే సంగతి నీ పక్కన పెడితే.. రాజకీయంగా శూన్యతను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు రేవంత్ రెడ్డి.
ఇటీవల ప్రధానమంత్రి మోడీ పాల్గొన్న కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గత ముఖ్యమంత్రి కంటే భిన్నంగా తన వ్యవహార శైలి ప్రదర్శించాడు. ప్రధానమంత్రిని ఆహ్వానించాడు. ఆయనకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చాడు. తెలంగాణకు ఏం కావాలో అడిగాడు. మీరు మా పెద్దన్న అంటూ ఆకాశానికి ఎత్తాడు. అది అవసరం. ఎందుకంటే ప్రధాని కాబట్టి.. రాష్ట్రం జుట్టు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి.. కానీ కమలం జుట్టు తన చేతికి చిక్కే సందర్భం వచ్చినప్పుడు రేవంత్ ఎందుకు ఊరుకుంటాడు.. అదే పని చేశాడు. దీన్నే రాజకీయంలో వ్యూహ చతురత అంటారు.. మరి ఈ చతురత కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఉపకరిస్తుందా? లేదా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.