Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు మీద ఉంది. ఇందులో భాగంగా కొన్ని మినహా దాదాపు సిట్టింగులకే సీట్లు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ కు గట్టి పోటీగా మారుతుందనుకుంటున్న కాంగ్రెస్ ఆరు సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ల విషయంలో పార్టీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన టికెట్ ఎంపిక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి మధ్యలోనే అలిగిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపు చేసిన తరువాత కాంగ్రెస్ లో టికెట్లపై ఆశావహులు పెరిగారు. బీఆర్ఎస్ లో టికెట్ రాని వారు కొందరు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీని నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు 74 మంది అభ్యర్థుల లిస్టుకు హైకమాండ్ ఓకే చెప్పింది. మిగిలిన 19 స్థానాలను పెండింగులో ఉంచింది. ఈ తరుణంలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం రసాభాసగా సాగింది. కొంతసేపు రేవంత్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడిపై అగ్రహం వ్యక్తం చేస్తూ హై కమాండ్ వద్ద తేల్చుకుంటామని సవాల్ విసరడం విశేషం..
రేవంత్ రెడ్డి వరంగల్ వెస్ట్ లో నరేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ లో అరికెల నర్సారెడ్డి, ఆర్మూరులో రాజారామ్ యాదవ్, ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి, దేవరకొండ లో బిల్యా నాయక్, ఇల్లందుకు హరిప్రియ, సూర్యపేట పటేల్ రమేష్ రెడ్డి, చెన్నూరు బోడ జనార్దన్ కు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఆయా నియోజకవర్గాల్లోని వారు వీరికి టికెట్ల కేటాయింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే స్క్రీనింగ్ కమిటీ సభ్యుల వాగ్వాదంతో అసహనానికి గురైన రేవంత్ రెడ్డి పార్టీ సమావేశం మధ్యలోనే లేచిపోయాడు. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.