Revanth Reddy: హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం విమర్శలు గుప్పించారు. గులాబీ పార్టీ ఉద్యమం ముసుగులో చేస్తున్న ఆకృత్యాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో ఖమ్మంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అక్కడ జెండాలు చూసిన మంత్రి కేటీఆర్ వారికి రూ.లక్ష జరిమానా విధించిన నేపథ్యంలో భాగ్యనగరంలో టీఆర్ఎస్ ప్లీనరీలో టీఆర్ఎ స్ పెట్టిన ఫ్లెక్సీలు, జెండాలకు ఎంత జరిమానా కడతారో చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మాత్రం స్పందించడం లేదు.

ప్లీనరీలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లి ఫ్లెక్సీ పెట్టడం చర్చనీయాంశం అయింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ఫొటోతో లబ్ధి పొందిన నేతలు ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లెక్సీ పెట్టడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణత్యాగంతో సాధించిన తెలంగాణకు గౌరవం ఇలాగేనా ఇచ్చేదని ప్రశ్నిస్తున్నారు. జలదృశ్యంలో ప్రారంభమైన పార్టీకి నేటి టీఆర్ఎస్ కు తేడా చాలా వచ్చింది. దీంతో అమరుల ప్రాణత్యాగాలు లెక్కలోకి రావడం లేదు.
రాష్ర్టంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. సమస్యలు ఎక్కడికక్కడే ఉంటున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. బిశ్వల్ కమిటీ నివేదికలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతోంది. నిరుద్యోగంపై ఎందరు ప్రశ్నించినా చలనం మాత్రం కనిపించడం లేదు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోగా వారిని ఆదుకుంటామని చెప్పిన నేతలు మాత్రం ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. తెలంగాణ విధానాలతో రైతులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎవరికి కూడా భరోసా ఇవ్వడం లేదు. ఫలితంగా రాష్ర్టంలో పాలన గాడి తప్పుతోందని తెలుస్తోంది. వీటిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.