Revanth Reddy Arrest: ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేస్తోంది. శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకుంటుంటే అడుగడుగునా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీకి వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున శాంతియుతంగా చేపట్టే కార్యక్రమానికి కూడా పోలీసులు అడ్డు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ర్టంలో పాలన ఎటు పోతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దిల్ సుఖ్ నగర్ వెళ్లేందుకు బయటకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. దీనిపై ఆయన ఆర్డర్ కాపీ చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే ఆక్షేపించడం ఏమిటని మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం దిల్ సుఖ్ నగర్ నుంచి జంగ్ సైరన్ ఆందోళన మొదలు కానుంది. అక్కడ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి అనంతరం ఎల్బీ నగర్ లోని శ్రీకాంత చారి విగ్రహం వరకు జంగ్ సైరన్ ఆందోళన ర్యాలీ కొనసాగేలా రూపకల్పన చేశారు.
కానీ ప్రభుత్వం అడ్డుకుని కాంగ్రెస్ నేతలను అడ్డుకుని గృహ నిర్బంధం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన ముందుకు సాగలేదు. కాంగ్రెస్ నేతలు రాజీవ్ చౌక్ కు చేరుకోగా పోలీసులు వారిని బలవంతంగా అరెస్టులు చేసి తరలించారు. కాంగ్రెస్ నేతలు వారిని గట్టిగా ప్రతిఘటించినా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులకు ఉద్యోగాల కోసం నిరుద్యోగ జంగ్ సైరన్ చేపడుతున్నట్లు ప్రకటించినా పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలను కొనుక్కున్న గులాబీ పార్టీ తీరును ఖండించారు. డబ్బులకు అమ్ముడుపోయి వేరే పార్టీల్లో చేరిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. అధికార పార్టీ డబ్బు సంచులతో రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు కాలం మూడినట్లేనని చెబుతున్నారు.