Renuka Chowdhury: ఐటీ వాళ్లు పిచ్చి వెదవలు: ఆ మాజీ ఎంపీకి మతిభ్రమించిందా?

రాజకీయ నాయకులకు మాట్లాడే మాట మీద పట్టు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితినే తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 15, 2023 2:14 pm

Renuka Chowdhury

Follow us on

Renuka Chowdhury: రాజకీయ నాయకులకు హుందాతనం ఉండాలి.. మాట్లాడే మాటలో పరిణతి ఉండాలి. అంతే కదా అని కండ్ల ముందు ఆ న్యూస్ ఛానల్స్ గొట్టాలు ఉండగానే రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత చాలామందికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య విమర్శలు తారాజువ్వల్లా ఎగిసి పడుతున్నాయి. కొన్నిచోట్ల అయితే ఆరోపణలు వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలా మాట్లాడాలనేది నాయకుల విచక్షణను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ వారికి ఆ కాలిక స్పృహ లేకపోవడం అత్యంత బాధాకరం.

సమర్థనీయమేనా

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని కాంగ్రెస్ పార్టీపై చాలామందికే ఆశలు ఉన్నాయి. మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కొంత మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో జనంలో ఉన్న ఆదరణను మరింత మెరుగుపరచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ కి ఆ సోయి లేనట్టు కనిపిస్తోంది. అధికారం ముంగిట ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం. ఉచిత విద్యుత్ మీద, వ్యవసాయ పంపుసెట్లు మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతున్నాయి. సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వంటి వారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఎన్నికల బహిరంగ సభలో పదేపదే వీటినే ప్రస్తావిస్తున్నారు.. ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఒకింత నష్టం చేకూర్చుతోంది. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా కూడా వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించడంతో సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డి గనక ఆ వ్యాఖ్యలు చేసి ఉండకపోయి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇక ఇది మర్చిపోకముందే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మాజీ సభ్యురాలు రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలు మరింత జటిలంగా మారాయి.

వెధవలు ఎలా అవుతారు

రాజకీయ నాయకులకు మాట్లాడే మాట మీద పట్టు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితినే తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది.. రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉండడం.. రేణుక చౌదరి ఆగ్రహానికి కారణమైంది. వెంటనే ఆమె హైదరాబాదులో ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐటీ అధికారుల దాడులను నిరసించాల్సింది పోయి.. తలా తోకా లేని
వ్యాఖ్యలు చేశారు. ఐటీ అధికారులు వెధవలు.. వారు వస్తున్నారని చెప్పి డబ్బులు మేము ఇంట్లో దాచుకుంటామా అని అనేశారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒక మామూలు నాయకులు చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ రేణుకా చౌదరి లాంటి పెద్ద స్థాయి నాయకురాలు చేయడంతో సహజంగానే ఇది వార్తాంశమైంది. మీడియాలో నిన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది.. ఐటీ అధికారులు రేణుకా చౌదరి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము వెదవలం అయితే అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్లు ఏమవుతారని ఐటి అధికారులు ప్రశ్నిస్తున్నారు.. రేణుక చౌదరి మతిభ్రమించి మాట్లాడుతున్నారని వారు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రేణుక చౌదరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి కారణమైంది. మరి దీనిని కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా సరిదిద్దుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా గతంలో భారత రాష్ట్ర సమితి నాయకులపై ఐటి అధికారులు దాడులు చేసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు భర్తీ చేస్తున్నారు. మరి ఈ ఐటీ దాడులు ఎవరికి ఎలాంటి మైలేజ్ ఇస్తాయో డిసెంబర్ 3న తేలిపోతుంది.