
ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో పని చేయడానికి సూపర్ వైజర్లు, సేల్స్ మెన్స్, సెక్యూరిటీ గార్డులు వగైరా ఉద్యోగులను కూడా నియమించింది. వీరందరికీ.. వారి వారి ఉద్యోగాన్ని బట్టి గరిష్టంగా 15 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు వీరిని ప్రభుత్వం కాంట్రాక్ట్ బేస్ ప్రకారం ఉద్యోగంలోకి తీసుకుందని అనుకుంటున్నారు. అయితే.. వీళ్లంతా తమ కంపెనీ ఉద్యోగులు అంటూ.. ‘రెడ్డి ఎంటర్ ప్రైజెస్’ అనే సంస్థ రావడంతో కలకలం రేగింది.
ఈ ఉద్యోగులను జిల్లాల కలెక్టర్లు ఏపీ బీసీఎల్ కోసం నియమించారు. కానీ.. వారంతా తమ ఉద్యోగులు అని చెబుతోంది రెడ్డి ఎంటర్ ప్రైజెస్ సంస్థ. అంతేకాదు.. గుర్తింపు కార్డులు జారీ చేయడానికి, ఈఎస్ఐ జాబితాలో చేర్చడానికి 10 వేల రూపాయలు చెల్లించాలని ఉద్యోగులకు సమాచారం కూడా పంపించింది. లేకపోతే.. జీతాలు రావంటూ హెచ్చరికలు కూడా జారీచేసిందట.
దీంతో.. ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ ఎవరిది? దీనికీ.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధం ఏంటి? అనే చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఏపీ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి కూడా మౌనంగానే ఉండడం గమనార్హం. అయితే.. రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అనేది ఒక సంస్థ అనీ, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉద్యోగులను ఏర్పాటు చేసే బాధ్యతను ఔట్ సోర్సింగ్ ప్రకారం ఈ సంస్థ దక్కించుకుందనీ, ఆ విధంగా అక్కడ పనిచేస్తున్న వారంతా ఈ సంస్థ ఉద్యోగులని అనుకోవాలన్నమాట.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఏపీ మద్యం విక్రయాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది ఏపీబీసీఎల్. మద్యం దుకాణాల్లో పనిచేసే వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారట. అంతేకాదు.. ఈ శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను కూడా ఆహ్వానించడం గమనార్హం. ఈ మేరకు ఏపీబీసీఎల్ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇది చూసిన వారంతా.. మద్యం అమ్మకాలకు ట్రెయినింగ్ ఏంటా అని బుర్ర గోక్కుంటున్నారు. అక్రమాల్లో ఇదో కొత్త పద్ధతి అని కూడా జనం చెప్పుకుంటున్నారు. మరి, దీనిపై ప్రభుత్వం, అధికారులు ఏమంటారో చూడాలి.