
హైదరాబాద్ పాత బస్తీలోని చాదర్ ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలక్ పేట ప్రాంతానికి చెందిన స్థానిక ఎంఐఎం కార్యకర్తగా భావిస్తున్న కమల్ నగర్ నివాసి మహ్మద్ షకీల్ మైనర్ దళిత బాలికను లైంగికంగా దోపిడీ చేశాడని ఆరోపించారు. ఐపిసి సెక్షన్లు, పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చాదర్ ఘాట్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
కేసు వివరాల ప్రకారం, కమల్ నగర్ నివాసి నిందితుడు షకీల్ ఖాన్ అదే ప్రాంత బాలికపై అత్యాచారం చేశాడు. నేరం చేసిన తరువాత, అతను ఆమెను బెదిరించాడు. అయితే, బాధితురాలు ఈ విషయాన్ని తన బంధువుకు తెలియజేసింది.
మరోవైపు ఎంఐఎం నాయకుడు షకీల్ ను ఉరి తీయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మొండయ్య డిమాండ్ చేశారు. మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అనుచరుడు షకీల్ పథకం ప్రకారమే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాలిక కుటుంబానికి ప్రాణ భయం ఉందన్నారు. బాధితురాలికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నా గోశ శంకర్, రేగుంట సాగర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే బిజెపి ఎంఎల్‌సి రామచందర్ రావు బాధితురాలి ఇంటిని సందర్శించి నిందితులకు కఠిన శిక్ష విధిస్తానని హామీ ఇచ్చారు.
ఇదే విషయం పై మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మాట్లాడుతూ…” షకీల్ ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి కాదని ఆయన అన్నారు. నాయకులతో కలిసి ఫోటోలు దిగితే పార్టీ సభ్యత్వం రాదని ఆయన తెలిపారు. షకీల్ కి పార్టీ నుంచి ఎటువంటి సభ్యత్వం ఇవ్వలేదని అహ్మద్ వెల్లడించారు.