సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని 80వ అధికరణం ప్రకారం గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతి నిర్ణయించారు. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరైన కేటీఎస్ తులసీ రిటైర్ కావడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యసభకు జస్టిస్ గొగోయ్ ను నామినేట్ చేయడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు.. ఈ చర్యను క్విడ్ ప్రోకోగా అభివర్ణించాయి. న్యాయవ్యవస్థపై దీని ప్రభావం ఉంటుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు, భవిష్యత్తు సీజేఐలకు రాష్ట్రపతి ఏం చెప్పాలనుకుంటున్నారని కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు.
రంజన్ గొగోయ్ గత ఏడాది నవంబర్ 17వ తేదీన రిటైర్ అయ్యారు. 2018 అక్టోబర్ 3వ తేదీ నుంచి 2019 నవంబర్ 17 వరకు ఆయన 46వ చీఫ్ జస్టిస్‌గా చేశారు. ఆయన సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ట్రిపుల్ తలాక్, అయోధ్య భూ వివాదం, శబరిమల, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలైన పిటిషన్లపై తీర్పులు ఇచ్చింది.