Amin sayani : ఇప్పుడంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఎఫ్ ఎం నుంచి స్మార్ట్ ఫోన్ దాకా.. చాట్ జీపీటీ నుంచి సోరా ఏఐ దాకా ఆస్వాదిస్తున్నాం. ఆనందిస్తున్నాం. అనుభవిస్తున్నాం..ఈ ఫోన్లు, టీవీ లు ఏవీ లేని కాలంలో.. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో.. మనుషులకు కాలక్షేపం రేడియో ద్వారానే అయ్యేది. ఆ రేడియోలో కూడా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ప్రచారం చేసే కార్యక్రమాలే శ్రోతలను వీణుల విందు చేసేవి. అలా మనదేశంలో మొదటి రేడియో స్టార్ గా అమీన్ సయానీ పేరు పొందారు. స్వర మాంత్రికుడిగా వినతికెక్కిన అతడు “బినాకా గీత్ మాలా” అనే కార్యక్రమంతో శ్రోతలను మై మరపింపజేసేవాడు. 91 ఏళ్ల వయసులో అమీన్ సయానీ ఫిబ్రవరి 20న గుండెపోటుతో శ్రోతలకు సెలవు చెప్పి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని అతని కుమారుడు రాజిల్ సయానీ ధ్రువీకరించాడు. గురువారం అమిన్ సయాని అంత్యక్రియలు నిర్వహిస్తారు. అతని మృతి పట్ల దేశంలోని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“సోదర సోదరీమణులారా.. నేను మీ ఆత్మీయ సన్నిహితుడిని.. నా పేరు అమీన్ సయాని. మీరు వింటున్నారు బినాకా గీత్ మాలా” అంటూ శ్రోతలను ఆనందింపజేసేవాడు. తన అద్భుతమైన గాత్రంతో ఎంతోమంది అభిమానం పొందాడు. అమీన్ సయాని మన దేశంలో మొట్టమొదటి రేడియో స్టార్. ఇతడు స్వర రాజుగా పేరుపొందాడు. బినాకా గీత్ మాలా కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందాడు..అమీన్ సయాని డిసెంబర్ 21, 1932లో ముంబైలో జన్మించాడు. అతడు తన 13 సంవత్సరాల వయసులో తన తల్లి నడిపే పక్ష పత్రిక ” రహ బారి” కోసం వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. ఆ వయసులోనే అతడు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించాడు.. ఆ తర్వాత కొంతకాలానికి ఆల్ ఇండియా రేడియో ముంబై లో చిన్నారులకు సంబంధించిన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు.
రేడియో వ్యాఖ్యాత కంటే ముందు హిందుస్తానీ అనే సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కి వెళ్ళాడు. అతని స్వరంలో హిందీ ఉచ్చారణ గుజరాతి భాష లాగా ఉండటంతో ఎంపిక చేయలేదు. అయితే అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి బీవీ కేస్కర్ ఆల్ ఇండియా రేడియో నుంచి హిందీ పాటలను నిషేధించారు. ఈ పరిణామంతో రేడియోసిలోన్ ప్రజాదరణ పొందడం ప్రారంభమైంది. 1952 లో అమీన్ సయానీకి సిలోన్ రేడియోలో బినాకా గీత్ మాలా కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. అప్పటినుంచి దాదాపు 1992 వరకు ఆయన ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 42 సంవత్సరాల పాటు ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అమీన్ సయాని మృతి పట్ల ఆల్ ఇండియా రేడియో సంతాపం వ్యక్తం చేసింది.