TRS MLAs Purchasing Issue: తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ట్రాప్ చేసి మోసం చేస్తోందని..మునుగోడు ఎన్నికల వేళ బీజేపీని టార్గెట్ చేస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలనే కొనడానికి బీజేపీ యత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ తరుఫున కొనడానికి వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేయించి కేసీఆర్ సర్కార్ విచారిస్తోంది.

అయితే మునుగోడు ఎన్నికల వేళ జరుగుతున్న ఈ డ్యామేజ్ పాలిటిక్స్ కు కోర్టులు ట్విస్ట్ ఇచ్చాయి. ముందుగా ఏసీబీ కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా.. డబ్బుల సంచులు.. సాక్ష్యాలు లేవంటూ కోర్టు నిందితులను విడుదల చేయిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో బీజేపీ నేతల వాదనే కరెక్ట్ అంటూ ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ సర్కార్ కావాలనే చేసిందని ఆడిపోసుకున్నారు.
ఈరోజు ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఏసీబీ కోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు ఎక్కింది తెలంగాణసర్కార్. హైకోర్టులో తెలంగాణ పోలీసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను రిమాండ్ కు హైకోర్టు ఆదేశించడం సంచలనమైంది.

దీంతో బీజేపీ నేతలకు కింది కోర్టులో దక్కిన ఊరట హైకోర్టులో దక్కకుండా పోయింది. కేసీఆర్ సర్కార్ కు, పోలీసులకు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ కేసు మలుపు తిరిగింది. ముగ్గురు నిందితులు వెంటనే తమ అడ్రస్ లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇవ్వాలని.. హైదరాబాద్ విడిచిపోవద్దని.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని , సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని నిందుతులకు హైకోర్టు షరతు విధించింది. ఏసీబీ కోర్టు నిందితులకు బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పును కొట్టి వేసి సంచలన తీర్పునిచ్చింది.
మొత్తంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ కోర్టులో బీజేపీ వాదనకు బలం చేకూరేలా నిందితులకు బెయిల్ లభించగా.. హైకోర్టులో టీఆర్ఎస్ వాదనే నెగ్గింది. నిందితులక రిమాండ్ పడింది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమంగా టీఆర్ఎస్ గెలుస్తుందా. లేదా? బీజేపీ వాదన నిలబడుతుందా? చూడాలి.