CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌డ్డి.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమౌతున్నారు. ఈ క్రమంలో జిల్లాలు, నియోకవర్గాల వారీగా క్యాడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న సభల్లో ప్రత్యర్థులపై పంచులు పేలుస్తున్నారు. ఇందు కోసం ముందే ప్రిపేర్ అయి వస్తున్నారు. మొన్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సభలోనూ టీడీపీని తెలుగు బూతుల పార్టీ అని, జన సేనను రౌడీ సేన అని పేర్కొన్నారు.

చంద్రబాబు టార్గెట్‌గా డైలాగ్స్..
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష్యంగానే పంచులు పేలుస్తున్నారు. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన సభలోనూ జగన్ తనదైన శైలిలలో చంద్రబాబుపై డైలాగ్స్ సంధించారు. ‘‘తన భార్య కోసం యుద్దం చేస్తే శ్రీరాముడు అంటారు.. పరాయి స్త్రీపై కన్నేస్తే రావణుడు అంటారు’’ అని పేర్కొన్నారు. పరాయి వాడి ఆస్తిని లాక్కుంటే కబ్జా దారుడు అంటారని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా ‘‘పార్టీ పెట్టుకుని ఎవరైనా అధికారంలోకి వస్తే ఒక ఎంజీర్.. ఒక ఎన్టీఆర్.. ఒక జగన్ అంటారని వివరించారు. అదే పార్టీని.. సీఎం సీటును కబ్జా చేస్తే అలాంటి వారిని చంద్రబాబు అంటారు’’ అంటూ పంచులు పేల్చారు.
మోసం చేసిన వారిని ఏమనాలి
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ భూసర్వేలో భాగంగా ఏడు 7,92,238 మంది భూ యజమానులకు భూ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాలనను ప్రజలకు దగ్గర చేసేందుకు వార్డు–గ్రామ సచివాలయాల మొదలు కొత్తగా మండలాలు.. జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు నిర్ణయించామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు అయిదేళ్లు కలిసి కాపురం చేసారని.. వారికి ఇచ్చాపురం, పలాసలోని కిడ్నీ పేషెంట్లు గుర్తుకు రాలేదన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలకు మాయ మాటలు చెప్పి.. ఆ తరువాత ప్రజలను మోసం చేసి అలాంటి చంద్రబాబును సమర్ధిస్తున్న వీరిని ఏమనాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
అసెంబ్లీకి పంపాలా.. బైబై చెప్పాలా?
తాను చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం జగన్ చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండని, మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని కోరారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా.. మీ సేవలు వద్దు బాబూ అంటూ బైబై చెప్పి ఇంటికి పంపాలా అని ఆలోచన చేయాలని సూచించారు.

మంచి జరిగితేనే ఆశీర్వదించండి
ఇచ్చాపురం, పలాస గ్రామాల్లో రూ.765 కోట్లతో ఈ రోజు సర్ఫెస్ వాటర్ తీసుకువచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే గొప్ప మార్పుకు ఈ రోజు అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు. కిడ్నీ పేషేంట్లకు సంబంధించి దాదాపుగా రూ.50 కోట్ల పైచిలుకుతో కిడ్నీ రిసెర్చ్ ఆసుపత్రి అక్కడ కడుతున్నామని చెప్పారు. 90 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. కిడ్నీ పేషెంట్ల కోసం మానవతా దృక్ఫథంలో ఆలోచన చేసి వారికి కూడా నెలకు రూ.10 వేలు డయాలసిస్ చికిత్స కోసం పింఛన్ ఇచ్చే గొప్ప మార్పుతీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని కోట్ల ఎకరాలకు సంబంధించిన సాగుభూములు, ఇతర భూములు చివరకు ఒక జానెడు కూడా తప్పు జరగకుండా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయిస్తున్నామని వివరించారు. తమ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారన్న భయం పూర్తిగా రైతుల నుంచి తొలగిపోతాయని, డూప్లికెట్ రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోతాయన్నారు. లంచాలకు పూర్తిగా అవకాశం లేకుండా పోతుందని తెలిపారు.