Prashant Kishor: ఒక వ్యాపారి పెట్టుబడి పెడితే కేవలం లాభాలను మాత్రమే ఆశిస్తాడు. ఏ దశలో కూడా నష్టాలను స్వీకరించడానికి ఒప్పుకోడు. అంతకూ అతడికి గనుక నష్టాలు వస్తే వ్యాపారాన్ని మూసుకుంటాడు. అంతేతప్ప అప్పులు తీసుకొచ్చి అడ్డగోలుగా వ్యవహరించడు. మన దేశంలో రాజకీయం కూడా వ్యాపారమే కాబట్టి.. సాధ్యమైనంత వరకు రాజకీయ పార్టీలు లాభాలను మాత్రమే చూసుకుంటాయి. లాభాల కోసం పరితపిస్తుంటాయి. రాజకీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. రాజకీయ పార్టీలకు సలహాలు ఇస్తూ సందడి చేసే దళారిల వ్యవహారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మనదేశంలో రాజకీయాలలో దళారీ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఈ మాట అనడానికి ఎటువంటి సందేహం లేదు. అతడు కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే బిజెపి వరకు పనిచేశాడు. ప్రాంతీయ పార్టీలకు కూడా పనిచేశాడు. భారీగా ఫీజులు వసూలు చేసే కోటీశ్వరుడు అయిపోయాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు జన్ సురాజ్ అనే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో ఉంచాడు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు 116 మంది అభ్యర్థులను ప్రశాంత్ కిషోర్ ప్రకటించాడు. మిగతా స్థానాలకు కూడా ఆయన అభ్యర్థులను ప్రకటించబోతున్నాడు. వాస్తవానికి దేశవ్యాప్తంగా నిత్యం వార్తల్లో ఉండే ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు.. తాను ప్రస్తుతం పార్టీ బలోపేతం పై మాత్రమే దృష్టి పెట్టానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించాడు. 150 సీట్లలో ఒక్కటి కూడా తగ్గినా దానిని ఓటమి గానే భావిస్తానని ప్రశాంత్ కిషోర్ చెప్పడం విశేషం.
క్షేత్రస్థాయిలో పార్టీకి అంత బలం లేనప్పుడు.. అంతగా బలోపేతం కానప్పుడు పోటీ చేయడం ఎందుకో ప్రశాంత్ కిషోర్ మాత్రం బయటికి చెప్పడం లేదు. మిగతా పార్టీల విషయంలో విభిన్నంగా వ్యవహరించే ప్రశాంత్ కిషోర్ తన పార్టీకి వచ్చేసరికి నీతులు చెప్పడం విశేషం. ఇవాల్టికి బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ,ఆర్జెడి.. బిజెపి, నితీష్ పార్టీల మధ్య పోటీ ఉంది. గత ఎన్నికల్లో కూడా ఈ నాలుగు పార్టీలే అక్కడ కీలకపాత్ర పోషించాయి. మెజారిటీ సీట్లు కూడా సాధించాయి. కానీ ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ మాత్రం అక్కడ ఏదో హంగ్ ఏర్పడుతుందని భావిస్తోంది. కొన్ని సీట్లు గెలిస్తే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చని అంచనా వేస్తోంది. కానీ అక్కడ అటువంటి సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ పనిచేసిన ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో అధికారంలోకి వచ్చింది. మిగతా సందర్భాలలో దారుణమైన ఓటములకు గురైంది. ప్రశాంత్ కిషోర్ తనకున్న మీడియా మేనేజ్మెంట్ ద్వారా గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత కాలంలో రాజకీయ పార్టీలు అతని దూరం పెట్టాయి. కాకపోతే అతడు అప్పటికే కావలసినంత సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీని పెట్టాడు. స్థూలంగా చెప్పేది ఏంటంటే రాజకీయ దళారి లాభం మాత్రమే చూసుకుంటాడు. ప్రజాసేవ అనేది అతని దృష్టిలో జస్ట్ ఒక హాస్యాస్పదమైన విషయం.