Rahul Gandhi- Poonam Kaur: భారత జాతీయ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర’ ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులో ప్రారంభించిన ఈ పాదయాత్ర మూడు రోజుల కింద తెలంగాణలో ప్రవేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట నడుస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర సందర్భంగా రాజకీయ నాయకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా తోడవుతున్నారు. తాజాగా తెలుగు నటి, పవన్ కల్యాణ్ హీరోయిన్ పూనమ్ కౌర్ రాహుల్ పాదయాత్రలో అనూహ్యంగా మెరిశారు. అంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలతో పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ఇప్పుడు పూనమ్ రాహుల్ పాదయాత్రలో కనిపించడంతో మరోసారి ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.

రాహుల్ జోడో యాత్ర శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన వెంట నడుస్తున్నారు. ఉదయం ఒక్కసారిగా ఈ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ ప్రత్యక్షమైంది. రాహుల్ వెంట నడుస్తూ కాసేపు ముచ్చటించింది. ఆయన చేతిని పట్టుకొని మరీ స్పీడుగా నడుస్తూ మాట్లాడింది. పూనమ్ కౌర్ పక్కనే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు వారి వెంట నడుస్తూ వచ్చారు.
కొంతదూరం వెళ్లిన తరువాత పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని సమస్యలపై రాహుల్ కు వివరించానన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ తో చర్చించానని, ఈ సమస్యలపై రాహుల్ బాగా అధ్యయనం చేస్తున్నారని అన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరినట్లు పూనమ్ కౌర్ తెలిపారు.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ కౌర్ ఆ తరువాత తెలుగు, తమిళం సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రాజకీయంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పై కూడా ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జల్సా’ మూవీలో తనకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి పక్కన బెట్టారని ఆరోపించారు. అప్పటి నుంచి పూనమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఆమె రాహుల్ పాదయాత్రలో కనిపించడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.