Ponguleti Srinivasa Reddy: పేరుకేమో తెలంగాణ వాదం.. కోరిందేమో ఆంధ్రా పార్టీ సాయం.. పొంగులేటి సంచలనం

ఆత్మీయ సమ్మేళనాల్లో సేకరించిన అంశాలు, కులా లు, మతాల వారీగా ప్రజల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకనే కాంగ్రె స్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని మా టీమ్‌ అంతా అనుకున్నాం.

Written By: Bhaskar, Updated On : July 6, 2023 12:13 pm
Follow us on

Ponguleti Srinivasa Reddy: భారత రాష్ట్ర సమితిది తెలంగాణ రాష్ట్రంలో బలుపు కాదా? కేవలం వాపు మాత్రమేనా? 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆ పార్టీలో లేకుండా పోయిందా? అధికారాన్ని దక్కించుకునేందుకు ఏకంగా ఆంధ్ర పార్టీ సహాయం కోరిందా? అంటే వీటికి అవుననే సమాధానం చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆయన మీడియాకు ప్రముఖంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద అంశాలను ఆయన తెరపైకి తెస్తున్నారు.

2014 ఎన్నికల కౌంటింగ్ సమయంలోనే తనను భారత రాష్ట్ర సమితిలో చేరాలని ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నా చుట్టూ తిరిగారు అని పొంగులేటి కుండబద్దలు కొట్టారు. మొదట్లో నేను తిరస్కరించినప్పటికీ, 27 నెలల తర్వాత గులాబీ కండువా. వైఎస్ఆర్ సీపీ ని వీడుతున్నట్టు చెబితే జగన్ వద్దన్నారు.. కష్టాలు ఉంటాయి వాటిని అధిగమిస్తేనే భవిష్యత్ ఉంటుందని ఆయన ఆరోజు చెప్పారు. కానీ నేను ఆయన మాట వినకుండా భారత రాష్ట్ర సమితిలో చేరాను అని పొంగులేటి చెప్పుకొచ్చారు.. తెలంగాణ బాగుపడుతుంది అని హామీ ఇస్తేనే తాను భారత రాష్ట్ర సమితిలో చేరానని, కానీ అందులో చేరిన తర్వాత జరిగింది వేరని పొంగులేటి వివరించారు.

“సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఇప్పించాలని మంత్రి కేటీఆర్‌ను కోరాను. ఆ సమయంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఉంది. అక్కడికి రమ్మని ఆయన చెప్పడంతో 20 మందితో కలిసి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక సీఎంను కలిసి మీతో ఏకాంతంగా మాట్లాడాలని అడిగా. ‘ఉంటావ్‌ కదా.. రేప్పొద్దున కలుద్దామ్మంటారు. ‘సంతోష్‌ రేపు ఉదయం పిలిపించు’ అంటారు. పొద్దున్నే రెడీ అయి సంతోష్ కు ఫోన్‌ చేసి వాట్‌ టైమ్‌ అని అడిగితే.. ‘టాక్‌ టూ పెదనాన్న’ అంటారు. అలా నాలుగు రోజుల పాటు పెద్ద నరకం కనిపించింది. వెంట తీసుకువెళ్లిన వారి ముందు ఎంతో అవమానం అనిపించింది. అప్పటి నుంచే నాలో కసి పెరిగింది. పార్టీని వీడాలని, కేసీఆర్‌ను గద్దెదించడమే నా అంతిమ ఆశయంగా నిర్ణయించుకున్నా.

అందుకే కాంగ్రెస్ లో చేరా
ఆత్మీయ సమ్మేళనాల్లో సేకరించిన అంశాలు, కులా లు, మతాల వారీగా ప్రజల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకనే కాంగ్రె స్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని మా టీమ్‌ అంతా అనుకున్నాం. ముందు కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా సొంతంగా పార్టీ పెట్టాలని అనుకున్నాం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ బలపడుతోంది. అందుకే ఆ పార్టీలో చేరాను. వివిధ స్థాయిల్లో కాంగ్రెస్‌ నేతలతో కూర్చున్న తర్వాత ప్రజల్లో, నాలో అనుమానం ప్రకారం.. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్ తో జాతీయంగా పొత్తు ఉంటుందా? అని అడిగాను. ఆ పార్టీతో ఇబ్బంది పడి వచ్చామని, దానితో ఉంటే మేం పార్టీలో చేరబోమని చెప్పాను. ఎటువంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పాకే కాంగ్రెస్ లోకి వచ్చాను.” అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

“మనుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పోటాపోటీగా పోరాడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ పార్టీలో సమూల మార్పులు వచ్చాయి. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేయకుండా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తు న్నది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి మధ్య ఏదో లాబీయింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు మంత్రి కేటీఆర్ వెళ్లిన తర్వాతే భారతీయ జనతా పార్టీలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయి.. ఇవన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని” శ్రీనివాసరెడ్డి కుండబద్దలు కొట్టారు. కాగా 2014 ఎన్నికల తర్వాత తనను పార్టీ మారాలని ఒత్తిడి చేసిన విషయాన్ని ఆయన బయటపెట్టడంతో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ గా మారింది.