KCR- Jagan: దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు పట్టుమని పది నెలలు వ్యవధి కూడా లేదు. తెలంగాణలో అయితే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలో సైతం ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అన్ని పార్టీలు ఓటర్ల పై మమకారం చూపించడం ప్రారంభించాయి. తాయిలాలు ప్రకటిస్తున్నాయి. విపక్షాలు రెట్టింపు సంక్షేమం అంటూ హోరెత్తిస్తున్నాయి. అటు అధికార పక్షాలు సైతం గత నాలుగేళ్లలో అమలు చేయని పథకాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నగదు బదిలీ పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి.అవే ఎన్నికల్లో తమకు ఓట్లను తెచ్చిపెడతాయని ఆశిస్తున్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే వర్షాకాలంలో చేపల ఎర మాదిరిగా ఓటర్లను గాలం వేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో లేదో కానీ.. మార్చిలో మాత్రం ఖాయం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ప్రారంభమైంది. అధికారంలో రావాలన్నది విపక్షాల ప్రయత్నం.. అధికారం నిలుపుకోవాలన్నది పాలక పక్షం ఆత్రం. దీంతో ఎవరికి వారే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ప్రతి ఎన్నికల్లో సెంటిమెంట్ను రాజేసి అధికారంలోకి రావడం కెసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే మూడోసారి అనుకున్నంత ఈజీ కాదు. అందుకే ప్రజా సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకొస్తున్నారు. నాలుగేళ్లుగా అమలు చేయని రుణమాఫీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. దళిత బంధు, బీసీ బందు పథకాలు ప్రకటించారు కానీ.. రైతు రుణమాఫీ ని మర్చిపోయారు. దీంతో ఎన్నికల్లో రైతుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి ఇప్పుడు రుణమాఫీ పై పడ్డారు. ప్రారంభ సూచికగా 167 కోట్లు రుణమాఫీ కోసం రిలీజ్ చేశారు. జస్ట్ శాంపిల్ అన్నట్టు చూపారు. ఎన్నికల ముంగిట మిగతా 19 వేల కోట్లు రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏకంగా మొత్తంతో ఓట్లు కొనేయవచ్చని భావిస్తున్నారు. ఆర్టీసీ విలీనాన్ని వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు అదే వరాన్ని ప్రకటించబోతున్నారు.
ఇక ఏపీ సీఎం జగన్ తక్కువ తింటారు అని ఎవరు భావిస్తారు. రెండోసారి అధికారంలోకి రావడానికి ఉన్న సాధ్యసాధ్యాలని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తన బుర్రకి పదును పెట్టారు. తనను గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్న వాలంటీర్లకు ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు. వారి వేతనాన్ని పదివేలకు పెంచనున్నట్లు మీడియాకు లీకులందిస్తున్నారు. ఎన్నికల ముంగిట వరాల సునామీ మాత్రం ఆగదని సంకేతాలిస్తున్నారు.
అటు విపక్షాలు కూడా తక్కువ తినలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ను ప్రకటించింది. సంక్షేమం విషయంలో వెనుకబడి ఉండే చంద్రబాబు సైతం.. భారీ తాయిలాలు ప్రకటించారు. ఏకంగా మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అంటూ ప్రజల ముందుకు వెళుతున్నారు. అయితే ఇదంతా ఓటర్ కు కడుపు నింపి ఎలక్షన్ బూత్ కు తీసుకెళ్లే వ్యూహం. అంతకుమించిన రాజకీయం ఇందులో లేదు. ఏది మంచో..ఏది చెడో ప్రజలకు తెలుసు. కానీ నేతలకు ఎరగా చిక్కి.. తమ భవిష్యత్తును చేజేతులా పోగొట్టుకుంటున్నారు. ఇక మేల్కోవాల్సింది ప్రజలే.