Sankranthi Kodi Pandalu: కోనసీమలో కోడి పందాలు కాకరేపుతున్నాయి. పోలీస్ వర్సెస్ పొలిటికల్ గా కోడి పందాలు మారాయి. కోడి పందాలు చట్ట వ్యతిరేకమని పోలీసులు చెబుతుంటే.. అనాదిగా వస్తున్న సంప్రదాయమని పొలిటికల్ బాస్ లు చెబుతున్నారు. చట్టాన్ని అమలు చేయాలా ?… పొలిటికల్ బాస్ ల మాటకు తలొగ్గాలా ? అన్న సందిగ్ధం పోలీసు వర్గాల్లో నెలకొంది.
Sankranthi Kodi Pandalu:
సంక్రాంతి మూడు రోజులూ కోనసీమలో కోడిపందాలు యథేచ్చగా జరుగుతాయి. కోట్ల రూపాయాలు చేతులు మారుతాయి. పొరుగురాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివస్తారు. కానీ ప్రతి యేటా లాగానే ఈసారి కూడ పోలీసు ఆంక్షలు పందెం నిర్వాహకుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలిటికల్ బాస్ లు మాత్రం మేమున్నాం అంటూ అభయమిస్తే.. పోలీస్ బాస్ మాత్రం మీ ఆటలు సాగనివ్వం అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో కోడిపుంజులు నిలుస్తాయా ? .. లేదా ? అన్న అనుమానం మొదలైంది.
“కోనసీమ సంప్రదాయాలకు అడ్డుపడొద్దు. ఎప్పటిలాగే జరగనివ్వండి. రాష్ట్రంలో ఎక్కడా ఏ సమస్యా లేదు. ఒక్క కోనసీమలోనే ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంది“ అంటూ పొలిటికల్ బాస్ లు పోలీస్ బాస్ పై పెదవి విరిచారు. అంతలోనే మంత్రి విశ్వరూప్ ఇంట్లో తోట త్రిమూర్తులు, రాపాక వరప్రసాద్, చీర్ల జగ్గిరెడ్డిలు సమావేశమయ్యారు. కోడి పందెం నిర్వహిస్తారని, పోలీసులు అడ్డుకోవద్దంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో పోలీసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు చట్టం, మరోవైపు అధికార పార్టీ ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు.
Sankranthi Kodi Pandalu:
అధికార పార్టీ అధిష్టానం నుంచి అనధికార గ్రీన్ సిగ్నల్ లభించిందట. దీంతో అధికార పార్టీ నేతలు బరులు సిద్ధం చేస్తున్నారట. కోడి పందేలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారట. భోగి రోజు నుంచే కోడి పందేల నిర్వహణకు స్థానిక నేతలు కసరత్తు చేస్తున్నారట. కేవలం మూడు రోజులు మాత్రమే పోలీసులు చూసిచూడనట్టు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడ కొనసాగితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ యేడు కూడ కోడి పుంజులు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి.