దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రాత్రి 8గంటలకు ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని మోదీ ట్వీటర్లో ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని ఎలాంటి విషయాలపై మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది. గడిచిన ఆదివారం ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దీనికి దేశ ప్రజలంతా మద్దతు తెలిపారు. అయితే ఆ తర్వాత కేంద్రం విధించిన లాక్డౌన్ చర్యలు విఫలమవుతున్న నేపథ్యంలో ప్రధాని మరోసారి తన ప్రసంగంలో కీలక విషయాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దేశ ప్రధాని ఈ వారంరోజుల్లో జాతినుద్దేశించి ప్రసంగించడం రెండోసారి. దేశంలో కరోనా పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా కేంద్రం పకడ్బంధీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశంలోని 75జిల్లాలో లాక్డౌన్ చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా విమాన, రైళ్ల సర్వీసులకు ఎక్కడికక్కడ నిలిపివేసింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహానిస్తూ కరోనా కట్టడికి తగు జాగ్రత్తలను తీసుకుంటుంది.
జనతా కర్ఫ్యూ కు ప్రజలు విశేషంగా మద్దతునిచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రజలంతా ఒక్కసారి రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సహకరించకపోవడంతో ప్రధాని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే కేంద్రం కఠిన చర్యలకు పూనుకుంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండాలనే అనసరంగా రోడ్లపై రావద్దని సూచిస్తుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు పూనుకుంటుంది.
ద్విచక్ర వాహనాలపై ఒకరి, ఫోర్ వీలర్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని సూచిస్తుంది. సామాజిక దూరం పాటించాలని సూచిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించిన వారిపై కేసులు పెట్టేందుకు వెనుకడటం లేదు. అలాగే వాహనాలను సీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని మరోసారి జాతినిద్దేశించి ప్రసంగించనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.