Bheemla Nayak: సోషల్ మీడియా అయినా..బయట అయినా.. పవన్ ఫ్యాన్స్ సృజనాత్మకతకు అంతం లేదని నిరూపితమైంది.పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తే ఎవరూ తట్టుకోలేరు. సోషల్ మీడియాను దడదడలాడిస్తారు. ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తారు. అందుకే పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకోవడానికే అందరూ భయపడుతారు. అయితే సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా పవన్ ఫ్యాన్స్ తమ డేరింగ్, డ్యాషింగ్ ను బయటపెడుతున్నారు. తాజాగా ఆంధ్ర నడిబొడ్డున పక్కరాష్ట్రం సీఎంను అభినందిస్తూ పెట్టిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘భీమ్లానాయక్’ మూవీ విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తెలంగాణసర్కార్ పూర్తిగా ‘భీమ్లానాయక్’కు సహకారం అందించి టికెట్ రేట్ల నుంచి బెనిఫిట్ షోల వరకూ , ఐదో షో వేయించి మరీ సహకరించింది. అదే సమయంలో ఏపీలో జీవో 35 అమలు చేస్తూ ‘భీమ్లానాయక్’ మూవీకి అడ్డంకులు సృష్టించారన్న ప్రచారం జోరుగా సాగింది.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై పవన్ ఫ్యాన్స్ ప్రతీకార చర్యలకు దిగారు. ఏపీ నడిబొడ్డున ఏపీ సర్కార్ ను అవమానించేలా ఏర్పాటు చేసిన ‘థాంక్యూ సీఎం సార్’ ఫ్లెక్సీ కలకలం రేపింది. అయితే పవన్ ఫ్యాన్స్ ‘థాంక్స్’ చెప్పింది ఏపీ సీఎంకు కాదు.. తెలంగాణ సీఎంకు.. అదే వివాదానికి కారణమైంది.
తెలంగాణలో భీమ్లానాయక్ చిత్రానికి పూర్తి సహకారం అందించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి తలసానిలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయవాడలోని కృష్ణలంకలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ‘ధన్యవాదాలు సీఎం సార్’ అంటూ కేసీఆర్ ను పొగుడుతూ రాశారు. ఇదిప్పుడు ఏపీలోనే కాదు.. సోషల్ మీడియా, మీడియాలో వైరల్ అయ్యింది.
దీనిపై వైసీపీ నాయకులు భగ్గుమన్నారు. ట్రాఫిక్ సమస్యలను ఎత్తిచూపుతూ కార్పొరేషన్ అధికారులతో కలిసి తొలగించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ ఫ్లెక్సీని ఎందుకు తొలగించారని ఆందోళన చేశారు.
విశేషం ఏంటంటే.. కేసీఆర్ ఫ్లెక్సీలు తొలగించిన పక్కనే సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రుల ఫ్లెక్సీలు ఉన్నాయి. వాటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవా? అని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.కేసీఆర్ ఫ్లెక్సీలతోపాటే వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 35ని భీమ్లానాయక్ థియేటర్లలో ఏపీ ప్రభుత్వం స్టిక్ట్ గా అమలు చేసింది. ప్రభుత్వ నిఘా కారణంగా కృష్ణా జిల్లాలో కలెక్షన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడం వల్ల కొన్ని సీ, డీ సెంటర్లలో ‘భీమ్లానాయక్’ను విడుదల చేయలేదు. కొన్ని సెంటర్లలో ఈ రోజు విడుదలకు నిర్ణయించారు. రెండోరోజు కృష్ణ జిల్లాలో కలెక్షన్లు రానున్నాయి.