Pawan War On Jagan: జనసేనాని పవన్ అసలు సిసలు రాజకీయాన్ని ప్రారంభించనున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా వ్యూహాలు రూపొందించనున్నారా? ఇన్నాళ్లు సమాజంలో మార్పు పంథాలో రాజకీయాలు నడిపారా? ఇక ఫక్తు రాజకీయ పక్షంలా జనసేనను తీర్చిదిద్దనున్నారా? అధికార పక్షానికి చుక్కలు చూపించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారంలోకి రానివ్వనంటూ పవన్ పలుమార్లు ప్రకటించారు. వైసీపీని గద్దె దించేందుకు అవసరమైతే భావసారుప్యత కలిగిన రాజకీయ పార్టీలతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే పొత్తులుంటాయని గట్టి సంకేతాలే పంపారు. అయితే ఇప్పుడు వైసీపీ అరాచక రాజకీయాలను ఎదుర్కొనేందుకు అవసరమైతే మిలిడెంట్ తరహా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. తద్వారా జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అందుకు సంబంధించి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.

జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. కానీ ఇంతవరకూ అధికారం వైపు పవన్ అడుగులు వేయలేకపోయారు. అయినా రాజకీయంగా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసినా ఆయన కృంగిపోలేదు. ప్రజలు తనను రెండు చోట్ల తిరస్కరించినా వారిపై ఆగ్రహంవ్యక్తం చేయలేదు. వైసీపీ సర్కారు ఇబ్బందులు పెట్టిన సమయంలో మాత్రం తన నిస్సహాయత వ్యక్తం చేశారు.తనను కనీసం అసెంబ్లీకి పంపించి ఉంటే గట్టిగానే నిలదీసి ఉండేవాడినని ఒక్క మాట తప్పిస్తే.. తనను ఓడించారన్న బాధ ప్రజలపై ఎప్పుడూ చూపిన సందర్భాలు లేవు. కేవలం మార్పు కోసమే పార్టీని స్థాపించానని చెప్పుకొస్తున్న ఆయన అందుకు తగ్గట్టు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. అధికార పక్షం నుంచి దాడులు ఎదురవుతున్నా వెరవలేదు. వెన్నుచూపలేదు. అప్పటికీ..ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాత్రం పవన్ జనసేనను తీర్చిదిద్దారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రజలకు అవసరమైన వాటినే ప్రస్తావిస్తున్నారు. అయితే ఇలా ప్రశ్నించే క్రమంలో అధికార పక్షం నుంచి ఆయనకు వ్యక్తిగత విమర్శలే ఎదురవుతున్నాయి. కానీ ఓపికగా భరించారు. నాడు ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అన్నివర్గాలను వైసీపీ ప్రభుత్వం దగా చేసినట్టు ఆరోపణలున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు రోడ్డెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. అమరావతి రాజధాని నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం …ఇలా అన్నింటిపై మాట తప్పింది. ఈ నేపథ్యంలో వాటిపై పవన్ ఎలుగెత్తడం ప్రారంభించారు. దీంతో అన్నివర్గాల వారిని ఇది ఆకర్షించింది. ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ ను చూడడం ప్రారంభించారు. అదే సమయంలో తన సొంత డబ్బులతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ సాయమందిస్తున్నారు. రాష్ట్రంలో 3 వేల మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో కర్షక వర్గాలు సైతం పవన్ ను అనుసరించడం ప్రారంభించాయి.
ఇప్పటికే ఒక సారి చంద్రబాబు, ఒక్క చాన్స్ అన్న జగన్ కు ఏపీ ప్రజలు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెజార్టీ ప్రజలకు పవన్ కు ఒక చాన్సిద్దామన్న భావనతో ఉన్నారు. కానీ జనసేన పార్టీ సంస్థాగతంగా ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. పవన్ పై ప్రజలకు నమ్మకం కుదిరినా క్షేత్రస్థాయిలో పనిచేసే అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి లోటే. ఇదే విషయం సర్వేల్లో తేలింది. నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై పవన్ దృష్టిపెట్టారు. అందుకే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న బస్సు యాత్రను సైతం వాయిదా వేసుకుంటున్నారు. కడప నుంచి చిత్తూరు వరకూ… నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ నియోజకవర్గాల సమీక్షకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, గెలుపోటములపై ఆరా తీయనున్నారు. అక్కడ గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు.
అయితే జనసేనలో వచ్చిన తాజా పరిణామాలతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. వాస్తవానికి ఈ తరహా రాజకీయాలు జనసేన ఎప్పుడూ చేయలేదు. సమాజంలో మార్పు కోసం పవన్ పరితపించారే తప్ప అధికారం కోసం అర్రులు చాచలేదు. కానీ అధికార వైసీపీ ప్రభుత్వ ఆగడాలు పెచ్చుమీరుతుండడంతో పవన్ తన వైఖరిని ప్రారంభించారు, తన రాజకీయ దెబ్బ రుచిని చూపించబోతున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతీ జిల్లాను యూనిట్ గా తీసుకోని ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలమెంత? అక్కడున్న లోటుపాట్లు ఏమిటనేది ఆరా తీయనున్నారు. అటు పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన చాలామంది నాయకులకు అధిష్టానం పట్టించుకోవడం లేదు., అటువంటి వారు అసంతృప్తిగా ఉన్నారు. వారంతా జనసేననే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా చేసుకుంటున్నారు. దీంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వమే తరువాయి చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికైతే జగన్ సర్కారుపై పవన్ యుద్ధానికి అన్నివిధాలా సిద్ధం చేసుకుంటున్నారు.
[…] Read: Pawan War On Jagan: జగన్ పై యుద్ధానికి పవన్ సై… ము… నైజాం 0.46 […]