Pawan Kalyan: స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలంతా ఒక్కటై కేంద్రాన్ని కదిలించిన తీరు దేశానికే ఉద్యమస్ఫూర్తిని పంచింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాలకు ‘తెలంగాణ ఉద్యమం’ ఒక స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఇలా అందరూ ఒక్కతాటిపైకి వచ్చి చేసిన సకలజనుల సమ్మె పోరాటం దేశానికే కారుచీకట్లను మిగిల్చి రాష్ట్రాన్ని తెప్పించేలా సాగింది.
ఈ క్రమంలోనే ‘తెలంగాణ మోడల్’ను ఏపీకి అన్వయించాలని జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాడడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు, రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఉద్యమ నమూనాను అనుసరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుతున్నారు.
‘‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా ‘జై తెలంగాణ’ నినాదం దేశమంతా ప్రతిధ్వనించింది. అలాగే ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదం రాష్ట్రంలోని ప్రతి మూలన కూడా వినిపించాలి. తద్వారా నినాదం ప్రతిధ్వనించాలి. కేంద్రానికి తాకాలి’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.
అయితే తెలంగాణ ప్రజలు, నాయకుల్లాగా ఏపీ నేతలు,ప్రజలు కలిసి పోరాటం చేసే అవకాశాలు అయితే లేవు. వారిలో ఆ కసి కనిపించడం లేదన్న విమర్శ ఉంది. ఐక్యత లోపించింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలిపి పోరాడిన సందర్భాలే లేవు. అదే తెలంగాణలో ‘జేఏసీ’ ఏర్పాటు అన్ని పార్టీలు వారి పోరాటానికి బాసటగా నిలిచాయి.
ఇప్పుడు ఏపీలోని అన్ని పార్టీలు, పార్టీలకు అతీతంగా రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చి విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్ర్తంగా జనసేన డిజిటల్ యుద్ధం
గత ఆదివారం మంగళగిరిలో ఒకరోజు దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని.. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ కళ్లు తెరిపించడానికే ఈ డిజిటల్ క్యాంపెయిన్ అన్నారు.
ఇక ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనూ వైసీపీ, టీడీపీ ఎంపీలు విశాఖ ఉక్కుపై ఆందోళన చేస్తే ఈ ఉద్యమానికి మరింత ఊపు వస్తుంది. ఈ క్రమంలోనే ఎంపీలందరికీ ఈ డిజిటల్ ప్రచారంలో ‘ట్యాగ్’ చేస్తూ వారిని డిఫెన్స్ లో పడేసేలా పవన్ ఎత్తుగడలు వేస్తున్నారు. మరి పవన్ రగిలిస్తున్న ‘విశాఖ ఉక్కు’ సెగ అందరికీ తగులుతుందా? అందరూ రోడ్డెక్కి ఉద్యమిస్తారా? కలిసి సాగుతారా? అన్నది వేచిచూడాలి.
Also Read: పవన్ ఆ సభకు వెళ్లకపోవడం వ్యూహాత్మకమేనా?