Chandrababu Meets Pawan Kalyan: తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియా వరమో.. శాపమో అర్ధం కావడం లేదు. ఆ పార్టీకి అడ్వాంటేజ్ వస్తే ఎంతకైనా తెగించే మీడియా సంస్థలు ఉన్నాయి. అయితే వాటి వల్ల టీడీపీకి మేలు కంటే కీడే ఎక్కువని హార్ట్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్స్ లో ఒక అభిప్రాయం ఉంది. గెలిస్తే తమ వల్లేనని చెప్పుకొస్తాయి. ఓటమి ఎదురైతే ముందే చెప్పాం.. చంద్రబాబు తమ మాట వినలేదని ప్రచారం చేస్తాయి. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పార్టీ మనుషులు కంటే అవే ఎక్కువగా లబ్ధి పొందుతాయి. నాయకుడంటే చంద్రబాబేనని.. ఆయనకు మించిన తోపు ఎవరూ లేరంటూ చూపించడానికి కూడా వెనుకాడవు. అయితే వారి ఆలోచన ఎప్పుడూ చంద్రబాబు అధికారంలో ఉండాలి. తాము లబ్ధి పొందాలి. వారిది అదే కాన్సెప్ట్. రాజ గురువు రామోజీరావు నుంచి కొత్త పలుకు చెప్పే రాధాక్రిష్ణ వరకూ వారిది అదే బాణి.. అదే వాణి. ఉదయం లేచింది మొదలు చంద్రబాబుకు, టీడీపీకి అనకూలంగాను, ప్రత్యర్థులను ప్రతికూలంగానూ వార్తలు, కథనాలు వండి వార్చుతాయి. మధ్యలో కులానికి కాస్తా మినహాయింపు ఉంటుంది. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి కమ్మ నాయకులకు ప్రాధాన్యమిస్తాయి. ఎవరి అవసరం ఎప్పుడు ఉంటుందోనని భావించి వ్యవహరిస్తుంటాయి.

చంద్రబాబుకు అవసరమున్న నాయకులకు ఆకాశానికెత్తేస్తాయి. అదే అవసరం లేదనుకున్న వారి ప్రాధాన్యతను తగ్గించేస్తాయి. పోనీ అంతటితో ఆగవు కూడా. డీ గ్రేడ్ చేసి పడేస్తాయి. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ నే తీసుకుందాం. 2014 ఎన్నికల్లో పవన్ ను పతాక శీర్షికన చూపించాయి. 2019 ఎన్నికలకు వచ్చేసరికి పక్కన పడేశాయి. పవన్ ప్రజాహిత కార్యక్రమాలను సైతం చూపెట్టే సాహసం చేయవు. ఏదో మూలన అప్రాధాన్యత వార్తగా చూపిస్తాయి. ఇప్పుడదే పవన్ చంద్రబాబును కలిసేసరికి మహా నాయకుడు, ఇంద్రుడు, చంద్రుడు అంటూ భుజానికెత్తుకున్నాయి. తెలుగునాట ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఈ వికృత క్రీడను వంటపట్టించుకున్న ఈ ఎల్లో మీడియా మధ్యలో అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీని చెరదీశాయి. అదే పార్టీని పాతాళంలో తొక్కేశాయి. వారికి కావాల్సిందల్లా టీడీపీ, చంద్రబాబుకు పనికొచ్చే విషయాలు. మిగతావన్ని వారికి అప్రాధాన్యం.. అప్రజాస్వామికంగా కనిపిస్తాయి. చివరకు తమ అభివృద్ధికి సహకరించిన ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేయడంలో కూడా కీలక భూమిక పోషించాయి. తమ మీడియా మనుగడ కోసం రంగులు మార్చుతుంటాయి. అల్టిమేట్ ప్రయోజనం, క్రెడిట్ అంతా టీడీపీకి ఇస్తాయన్న మాట. పోనీ తెలుగుదేశం పార్టీలో కమ్మ బ్యాచ్ కు తప్ప మిగతా కులాల నాయకులకు కూడా ఈ మీడియా సంస్థలు అడ్డుకట్ట వేస్తుంటాయి.
అయితే తాజాగా చంద్రబాబును పవన్ కలిసిన ఎపిసోడ్ లో కూడా తమ రాజకీయాలు మొదలు పెట్టేశాయి. పవన్ కు కేవలం 30 సీట్లు ఇస్తారని.. చంద్రబాబును సీఎం అంటూ విష ప్రచారానికి తెరతీశాయ. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్యమన్నట్టు,. ఇలా పవన్ చంద్రబాబును కలిశారో లేదో పొత్తు కన్ఫర్మ్ అయినట్టు చెప్పుకొస్తున్నాయి. వైసీపీ విముక్త ఏపీ కోసం పోరాడుతానన్న పవన్ సీఎం సీటును చంద్రబాబుకు వదిలేశారన్న విష ప్రచారానికి బీజం వేస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు పొత్తు ఎవరికి అవసరం? ఎవరికి ప్రాధాన్యతాంశం? ఎవరి సాయం ఎవరికి కావాలి? పొత్తు కోసం వెంపర్లాడుతున్నదెవరు? అన్నది ఏపీలో రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరైనా చెబుతారు. కనీసం ఈ చిన్న లాజిక్ ను మిస్సయిన ఎల్లో మీడియా తన పాత చింతకాయల వాసన పసిగట్టలేని వారున్నారా? సోషల్ మీడియా విస్తృతమైన ఈ రోజుల్లో తన మీడియా ఆధిపత్యంను తెలుసుకోలేని వారు ఎవరైనా ఉంటారా? అన్నది ఎల్లో మీడియా యాజమాన్యాలు గ్రహించాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్, జనసేన గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవం. గత ఎన్నికల్లో 40 నియోజకవర్గాల్లో జనసేన గణనీయైన ప్రభావం చూపింది. త్రిముఖ పోరులో వైసీపీ గెలుపు సాధించింది. అయితే ఈసారి పవన్ మేనియా అమాంతం పెరిగింది. కాపు సామాజికవర్గం సంఘటితమవుతోంది. యువత కూడా టర్న్ అయ్యారు. పవన్ తోనే ఏపీకి న్యాయం జరుగుతుందని తటస్థులు భావిస్తున్నారు. 25 కిలోల బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవితకు బాటలు వేస్తానని పవన్ చేసిన ప్రకటనలు వారిని ఆలోచింపజేస్తున్నాయి. గెలుపుపై ఆశలు వదులుకున్న టీడీపీ పవన్ ను ఒక ఆశాదీపంలా చూస్తున్న తరుణంలో 20, 30 సీట్లు అంటూ ఎల్లో మీడియా విష ప్రచారం మొదలుపెట్టింది. దాదాపు 75 స్థానాలు తగ్గకుండా ఇవ్వడంతో పాటు పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే బలమైన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీని ఎదుర్కొనవచ్చని భావిస్తున్నారు.