https://oktelugu.com/

Pawan Kalyan Konaseema: కోనసీమ అల్లర్లపై సంచలన నిజాలు చెప్పిన పవన్ కళ్యాణ్

• రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దాష్టీకం ఇది • కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు • ముఖ్యమంత్రి కనీసం దీనిపై మాట్లాడక పోవడం విడ్డూరం • కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్రలు చేస్తున్నారు • కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారు • డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి లేఖ రాస్తా • గోదావరి జిల్లాల్లో ఇక వైసీపీ కనుమరుగు • వైసీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2022 / 08:34 AM IST
    Follow us on

    • రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దాష్టీకం ఇది
    • కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు
    • ముఖ్యమంత్రి కనీసం దీనిపై మాట్లాడక పోవడం విడ్డూరం
    • కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్రలు చేస్తున్నారు
    • కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారు
    • డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి లేఖ రాస్తా
    • గోదావరి జిల్లాల్లో ఇక వైసీపీ కనుమరుగు
    • వైసీపీ అధినేతదే దాడుల చరిత్ర
    • కాపు, కమ్మ, శెట్టిబలిజ, మత్స్యకారులను వైసీపీ వర్గ శత్రువులుగా ప్రకటించింది
    • మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  

    Pavan Kalyan

    Pawan Kalyan Konaseema: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలకు, బహుజన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే కోనసీమ అల్లర్లు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏకంగా ఒక మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన అంశం జాతీస్థాయిలో సంచలనం అయినప్పటికీ కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడం, డీజీపీ సైతం పట్టనట్లు వ్యవహరించడం చూస్తుంటే మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. శనివారం జరగబోయే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి చర్చలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం, ఆయన రాజ్యాంగ భేటీ చర్చలు పూర్తి స్థాయిలో చదివిన వ్యక్తిని. కోనసీమకు అంబేద్కర్ పేరును పెడుతున్నప్పుడే దానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జనసేన పార్టీ స్పష్టత ఇచ్చింది. కోనసీమ జిల్లా పేరు విషయంలో ఏ ఉద్దేశంతో ఉద్యమం మొదలయినా, దీనిలో వైసీపీ పొలిటికల్ గేమ్ కచ్చితంగా ఉంది. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మేం అమరావతి రైతుల గురించి 300 మంది ఒకే చోట గుమికూడితేనే డి.ఐ.జి. స్థాయి వ్యక్తి వచ్చి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోనసీమ జిల్లా విషయంలో భిన్నాభిప్రాయాలతో గొడవ జరిగే అవకాశం ఉందని ముందుగానే ఇంటెలిజెన్స్ విభాగానికి ఎందుకు తెలియలేదు? కేంద్ర నిఘా వర్గాలు ఇక్కడి పరిస్థితిపై

    ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడ లోపం ఉంది. పోలీసులు ఎందుకు సన్నద్ధంగా లేరు అనేది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా విషయంలో కచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాటిని పరిష్కరించాల్సిన విధంగా పరిష్కరించాలి. ఎన్టీఆర్ జిల్లా పేరు విషయంలోనూ, సత్యసాయి జిల్లా విషయంలోనూ ఇలాంటి అభ్యంతరాలు వచ్చినా ఎంతో సామరస్యంగా స్పందించిన ప్రభుత్వం కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు అంశాన్ని ఎందుకు పరిష్కరించలేక పోయింది. దీనికి పాలకులు సమాధానం చెప్పాలి.

    • అటు యానాం… ఇటు పశ్చిమ గోదావరికో వెళ్ళి పని చేసుకోవాలా?
    అల్లర్ల పుణ్యమా అని వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్న ఉద్యోగులకు ఇంటర్నెట్ కష్టాలు తప్పడం లేదు. వారు యానాంగానీ ఇటు పశ్చిమ గోదావరికో వెళ్లి పని చేసుకోవాలా? అంబేద్కర్ గారి ఆశయాల మేరకు జనసేన పార్టీ పని చేస్తుంది. ఈ దేశంలో అంబేద్కర్ గారి మీద గౌరవం లేని వ్యక్తి ఉంటారా? కావాలనే ఈ ప్రభుత్వం ఆ మహనీయుడి పేరును వివాదం చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టి… కొన్ని కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తోంది.

    • కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి
    కోనసీమ అల్లర్ల విషయంలో ఇటీవల కొందరు నాయకులతో మాట్లాడిన సందర్భంలో కేంద్ర నిఘా సంస్థలు సైతం అల్లర్లపై ముందుగానే హెచ్చరించినట్లు తెలిసింది. మరి అలాంటప్పుడు పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? కోనసీమ జిల్లాకు పేరు మార్పు విషయంలో మొదటి రోజు స్థానిక వైసీపీ నేతలు ఇష్టం లేదన్నారు.. మూడో రోజుకీ ఆందోళనలు తీవ్రతరం చేసి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే నన్ను ఏదో అన్నప్పుడు మా పార్టీ శ్రేణులు నిరసన తెలిపేందుకు కాకినాడ వెళ్తున్న సందర్భంగా అక్కడ 144 సెక్షన్ పెట్టారు. సుమారు 300కుపైగా పోలీసు దళాలతో కాశ్మీర్ ను తలపించేలా హడావిడి చేశారు. మరి కోనసీమ అల్లర్ల విషయంలో పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు అనేది కూడా అర్ధం కావడం లేదు. ఇప్పటికీ మంత్రులు స్పందించకపోవడం, పోలీసులు అనుకున్నంత మేర వేగంగా ఈ విషయంలో ముందుకు వెళ్లక పోవడం చూస్తుంటే ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా అల్లర్లు చేయించినట్లు అర్థం అవుతోంది. కులాల మధ్య గొడవలు రేపి ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే కోణం దీనిలో కనిపిస్తోంది.

    • ప్రభుత్వ కుట్రలో మంత్రి బాధితుడిగా మారారేమో?
    మంత్రి శ్రీ పినిపే విశ్వరూప్ చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. హుందాగా ఉంటారని పేరు. ఘటన జరిగిన తర్వాత ఆయన వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి పేరు చెప్పారు. దీంతో పాటు మంత్రి కుమారుడు సైతం ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధిపై ఆరోపణలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఈ కుట్ర ఎవరు చేశారో ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ కుట్రలో మంత్రి బాధితుడిగా మారారేమో అని అనిపిస్తోంది. కోనసీమ అల్లర్ల విషయంపై శివసేన పార్లమెంటేరియన్ శ్రీ సంజయ్ రౌత్ కోనసీమ అల్లర్లను కేంద్రానికి, మోదీ గారికి ముడి పెడుతూ వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్ల అంశంలో కేంద్రం కానీ, బీజేపీ గానీ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాయి..? ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్తా. రాష్ట్రంలోని శాంతిభద్రతల అంశాన్ని, అలాగే కోనసీమ అల్లర్ల విషయాన్ని మాట్లాడేందుకు డీజీపీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశాం. మూడుసార్లు రిమైండర్ లు ఇచ్చాం. వారి కార్యాలయానికి ఫోన్లు చేశాం. ఆయన రేపటి వరకు స్పందించకపోతే ఉదయమే కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి లేఖ రాస్తా.

    • ఈ అల్లర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మైనస్
    కోనసీమ అల్లర్లు జరిగితే స్పందించని మంత్రుల బృందం బస్సు యాత్ర పేరుతో బయలుదేరడం విడ్డూరంగా ఉంది. ఈ సమయంలో బస్సు యాత్ర ఎలా చేస్తారు..? కోనసీమ తగలబడుతుంటే మంత్రులకు బస్సు యాత్రలు అవసరమయ్యాయి. కోనసీమ అల్లర్ల విషయంలో రాజకీయంగా ప్లస్, మైనస్ అనేది జనసేన పార్టీ తీసుకోదు. ప్రజల మధ్య అల్లర్లు సృష్టించి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి విషయమైనా జనసేన ఖండిస్తుంది. కోనసీమ అల్లర్లు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైనస్ గానే భావిస్తాను. పాలనలో ఉన్న ప్రభుత్వం దీనిపై బాధ్యత తీసుకోవాలి. విధ్వంసానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి హత్య సమయంలో విజయవాడలో చెలరేగిన అల్లర్లు సుమారు నెల రోజులపాటు కుదిపేశాయి. విజయవాడ అలంకార్ థియేటర్ యజమాని శ్రీ శశిభూషణ్ గారు ప్రతి రోజూ జరిగే అల్లర్లను తట్టుకోలేక విజయవాడ నుంచి వెళ్లి పోయే పరిస్థితి ఏర్పడింది. అల్లర్ల తాలూకా గాయాలు మానడం చాలా కష్టం. అవి కచ్చితంగా భవిష్యత్తులోనూ వెంటాడతాయి. ఏదైనా విషయంలో భావ వైరుధ్యాలు ఉండవచ్చు కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు ఎవరికీ లేదు. గాయాలు మాన్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోగా, వాటిని మరింత రెచ్చగొట్టాలని చూడడం అత్యంత బాధాకరం. డీజీపీ తన బాధ్యతను మరింత సీరియస్ గా తీసుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణకు చొరవ చూపాలి.

    • కులాలు, వర్గాలుగా విడిపోయాం
    ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కుల కోణాలు, సమీకరణాలు ఎక్కువయ్యాయి. ప్రతి విషయంలోనూ ఇవి అడ్డుపడుతున్నాయి. ఆధిపత్యం చూపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం కులాలు, వర్గాలుగా విడిపోయింది. ఇదే ఇప్పటి పాలకులకు వరంగా మారుతోంది. మీడియాలో కూడా కుల ప్రస్తావన, జాడ్యం ఎక్కువ కావడం బాధాకరం. కోనసీమ అల్లర్లను సృష్టించిన వారు ఎవరైనా అరెస్టు చేయండి. చట్టప్రకారం శిక్షించండి. దానికి మళ్లీ రాజకీయ కోణం ఎందుకు? శాంతి భద్రతల పరిరక్షణలో తన మన భేదం ఉండకూడదు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు దళిత యువకుడిని హత్య చేసిన విషయాన్ని మరుగునపరచడానికే ప్రభుత్వం ఈ కుట్ర కోణానికి తెర తీసి ఉండవచ్చు. ఒక సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వానికి మనసు ఉండదు కానీ.. ఆ సమస్య నుంచి పక్కకు వెళ్ళడానికి మరో సమస్యను సృష్టిస్తుంది. ప్రజలను నమ్మించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది.

    • సామాజిక న్యాయం అంటే అందరికీ న్యాయం జరగాలి
    వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే శెట్టిబలిజ, కాపు, కమ్మ, మత్స్యకారులను వర్గ శత్రువులుగా ప్రకటించింది. ఏ ప్రభుత్వం అయినా పూర్తిస్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా పాలన చేయాలి. అన్ని వర్గాలు కలిసి ఓట్లు వేస్తేనే వైసీపీ 151 సీట్లు వచ్చాయి అన్న విషయం గుర్తుంచుకోవాలి. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఆ న్యాయం కింద స్థాయిలో అమలు కావాలి. వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తులో ఉన్నతిని పొందడానికి సామాజిక న్యాయం బలంగా పని చేయాలి. కొందరు నాయకులకు పదవులు ఇచ్చి అదే న్యాయం అనుకోవడం వల్ల ఒరిగిందేమీ లేదు. బీసీ యువతలో తమకు ఏమీ జరగడం లేదన్న అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తోంది. సామాజిక న్యాయం కావాలి అనుకునేవారు సమాజం మధ్య గొడవలుపెట్టరు. ఉన్నత విద్య కోసం అందించే అంబేద్కర్ ఉపకార వేతనాలను నిలిపివేశారు. అంటే యువత ఉన్నత విద్య చదువుకునేందుకు అవాంతరాలు సృష్టించినట్లే. మరి ఇదేం న్యాయం..? అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం దానిలో నిధులెన్ని ఉన్నాయో.. ఎంత మందికి లబ్ధి చేకూరింది అన్న లెక్కలు కూడా చూపాలి. కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి ఒక కార్యాలయం పెడితే సరిపోదు. అది సామాజిక న్యాయం లెక్కలోకి రాదు.

    • చరిత్రను సరిదిద్దే పేరుతో.. భవిష్యత్తును నాశనం చేయకూడదు
    ఎవరి మతం ఎవరి దేవాలయం పవిత్రతను వారు కాపాడుకోవడం సహజం. మొఘలుల కాలంలో హిందూ ఆలయాలు మీద కొన్ని తప్పులు జరిగాయి. సుమారు 30 వేల నుంచి 40 వేల ఆలయాలను ధ్వంసం జరిగినట్లు చెబుతారు. అయితే దాన్ని ఇప్పుడు సరిదిద్దే క్రమంలో భవిష్యత్తును ఇబ్బందులపాలు చేయకూడదు. మధుర, ఇతర చోట్ల వ్యక్తులు సామరస్యంగా మాట్లాడుకోవడం మేలు. చరిత్రను మళ్ళీ మార్చలేము కదా? మార్చే క్రమంలో ప్రతిసారి గొడవపడితే ఎవరికి ప్రశాంతత ఉండదు. కొందరు వ్యక్తులు చేసిన తప్పులు మొత్తం మతానికి అన్వయించడం మంచి పద్ధతి కాదు. తప్పు చేసిన ఆ కొద్ది మందిని ఉపేక్షించ కూడదు. సున్నిత భావాలను రెచ్చగొట్టడం జనసేన పార్టీ విధానం కాదు. ప్రతి మసీదులోనూ శివలింగం ఉంది అనుకోకండి అని సమాజానికి శ్రీ మోహన్ భగవత్ గారు చెప్పిన మాట ఆచరణీయం. గుంటూరు జిన్నా టవర్ విషయంలోనూ ముస్లిం నాయకులను తగిన విధంగా సంప్రదించి, చర్చించి సమస్యను పరిష్కరించాలి. అక్కడ జిన్నా టవర్ పేరు ఉంచాలా? లేదా అనేది వారిని అడిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. మహమ్మద్ ఆలీ జిన్నా గొప్ప మేధావి. స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి. మత ప్రాతిపదికన ఆయన దేశం కోరిన పర్యవసానంగా 21 లక్షల మంది చనిపోయారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన అర్ధరాత్రి పంజాబ్ లో 55వేల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. కాబట్టి అక్కడి టవర్ పేరు విషయంలో ముస్లింలు సామరస్యంగా చర్చించుకోవాలి… ముస్లింల్లో గొప్ప త్యాగధనులు, అబ్దుల్ కలాం గారి లాంటి మేధావులు ఉన్నారు. జనసేన పార్టీకి స్పష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తూ తగిన వారితో ముందుకు వెళ్తాం.

    • మరోసారి వైసీపీ అధికరంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం
    భారతీయ జనతా పార్టీపై గౌరవ భావం ఉంది. బీజేపీ నాయకులు ఎవరూ నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు నాకేమి చెప్పలేదు. కొన్ని మీడియాలో వచ్చిన దానికి సమాధానం చెప్పలేను. పొత్తులపై చాలాసార్లు స్పష్టమైన విషయాలు చెప్పాను. పొత్తులు అంటే కేవలం మా పార్టీ నిర్ణయం మేరకు మాత్రమే ఉండవు. దానికి అన్ని అంశాలు, పరిస్థితులు అనుకూలించాలి. పొత్తుకు వచ్చే ఇతర పార్టీల సిద్ధాంతాలు, వారి వ్యూహం కూడా వారికి ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ముందుకు వెళ్తాం. మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే సర్వ నాశనం అవుతుంది అనే కోణంలోనే నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని చెప్పా. దీనికి కలిసి వచ్చే పార్టీలు తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దాలంటే నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నాను.

    • ఆ మాత్రం దానికి దావోస్ ఎందుకు?
    దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు రాష్ట్ర మంత్రి చెప్పడం ఆనందం. చేసుకున్న ఎంఓయూలు పూర్తిస్థాయిలో పరిశ్రమలుగా మారి ఉపాధి అందించినప్పుడు రాష్ట్రానికి మేలు చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం గొప్పగా చేసింది అనే మాట చెప్పండి. అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో ఎంఓయూ లు చేయించుకోవడానికి దావోస్ వరకు వెళ్లడం ఎందుకు? ఛార్జిలు, పర్యటన ఖర్చులు వృధా. హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో కంపెనీ ప్రతినిధులను కలిస్తే ఎంఓయూ చేసుకోవచ్చు. విజయవాడ కూడా వస్తారు. దానికి పెద్ద పెట్టుబడులు తీసుకువచ్చినట్లు చెప్పుకోవడం ఎందుకు..?

    • గోదావరి జిల్లాలను వైసీపీ మరచిపోవచ్చు
    శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుంది. హింసను ప్రేరేపించే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉండదు. రోజూ గొడవలుగా ఉంటే ప్రజలు తమ వ్యక్తిగత కష్టాలతో పాటు సామాజిక కష్టాలు తోనూ పూర్తిస్థాయిలో సతమతమవుతారు. అలాంటి పరిస్థితికి విసిగి పోతారు. పాలకులు దానిని నియంత్రించలేనపుడు వారి నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ప్రజల పరిస్థితి ఇలాగే ఉంది. కాపాడాల్సిన ప్రభుత్వమే మరింతగా అల్లర్లను రెచ్చగొట్టేలా చేస్తోంది. దీనిని గోదావరి జిల్లాల ప్రజలు గమనిస్తున్నారు. కచ్చితంగా తూర్పు గోదావరిలో వైసీపీని మర్చిపోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ప్రజలు సమాధి కట్టడం ఖాయం.

    • సీపీఎస్ రద్దుకు కట్టుబడి ఉన్నాం
    వై.ఎస్.ఆర్.సి.పి. అంటే ఆ పార్టీ పేరులోనే ఉన్న యువతకు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం, శ్రామికుడికి ఇసుక పేరుతో ఇబ్బందులు, రైతుకు ధాన్యం కొనుగోలులో మొండిచేయి చూపారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తన జీవితాన్ని ధారపోసి ప్రభుత్వ సేవలోనే ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తగిన భరోసా దక్కాల్సిందే. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థికంగా వారు ఇబ్బందులుపడకూడదు. సీపీఎస్ రద్దుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంది. దీనికి పక్కా ప్రణాళిక లేదు కానీ ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేశారు అంటే అది సాధ్యమే అని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానని మోసపు మాటలు శ్రీ జగన్ రెడ్డిలా చెప్పం కానీ దాని రద్దుకు ఒక సమగ్రమైన కార్యాచరణతో, అధ్యయనం చేసి సీపీఎస్ రద్దు చేస్తామని మాట ఇస్తున్నాను.

    • వైసీపీ ఉన్నంతకాలం పోలవరం పూర్తి కాదు
    వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. అది వాళ్ళకి తెలిసే ప్రాజెక్ట్ పూర్తికి గడువులు లేవు అని ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. కేంద్ర పెద్దలు మాత్రం పోలవరానికి ఇస్తున్న నిధులను ప్రభుత్వం ఇష్టానుసారం పక్కదారి పట్టిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగానే నిధులను ఇవ్వలేకపోతున్నామని, ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా వేరే పథకాలకు దారి మళ్లిస్తున్నారు అని చెబుతున్నారు. కేవలం పోలవరం నిధులు కాదు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ప్రభుత్వం ఇష్టానుసారం దారి మళ్లిస్తోంది. దీనిపై కేంద్రం మాటలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.

    • దాడి వాళ్ల నాయకుడు నేర్పిన విద్యే
    వైసీపీ నాయకులు అధికారులపై దాడులు చేయడం కొత్త కాదు. సాక్షాత్తు వైసీపీ అధినేతే పులివెందులలో ఒక ఎస్.ఐ. మీద గతంలో చేయి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మానవ హక్కుల సంఘంలో కొన్ని నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం చాలా తప్పు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అధికారుల విషయంలో ఏమైనా తప్పులు దొర్లితే అడగాల్సిన పద్ధతి ఉంది. అలా కాకుండా భౌతిక దాడులకు దిగి ఉద్యోగులపై పెత్తనం చెలాయించాలని చూడడం హేయం” అన్నారు. ఈ ఇష్టాగోష్టిలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.