Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే.. అక్కడ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా బహిరంగ సభలో నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జెండా పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈసారి అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండేందుకు.. జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, కచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా చేస్తున్న వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జనసేన కార్యకర్తలతో ఇష్టా గోష్టిగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. చాలా విషయాల్లో కుండ బద్దలు కొడుతున్నారు. అయితే అవి ప్రత్యర్థి పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ” నేను జగన్ పై పోటీ చేయడాన్ని ఇష్టపడతాను. పులివెందుల పోటీ చేసి ఓడిపోవడం నాకిష్టం. ఇలాంటి ఓటమికంటే నాకు అలాంటి ఓటమి ఇష్టమని” పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ఓటమిని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే అవకాశం దొరికినప్పుడల్లా దాని గురించి చర్చిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించినప్పటికీ.. కొన్ని విషయాలలో విమర్శించినప్పటికీ.. ఆయనను బలమైన ప్రత్యర్థిగా పవన్ భావించడం విశేషం.
కాగా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసిపి నాయకులు స్పందిస్తున్నారు. “పవన్ కళ్యాణ్ ఎట్లాగూ పులివెందులలో పోటీ చేసినా ఓడిపోతారు, అదే విషయాన్ని ఆయన ప్రకటించారు.. జగన్ చాలా బలమైన నాయకుడు. ఇన్నాళ్లకైనా పవన్ కళ్యాణ్ కు జగన్ బలం తెలిసింది. అందువల్లే నేను పోటీ చేసి ఓడిపోతానన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాస్తవాన్ని గ్రహించారని” వైసిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అటు జనసేన నాయకులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది..