Pawan Kalyan Target 2024: ఆంధప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా రాజకీయ వేడి రాజుకుంటోంది. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో వైసీపీలో వణుకుపుడుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేకనుక జరిగితే తాము అధికారంలోకి రావడం కల్లా అని ఫిక్స్ అయినట్లు కన్పిస్తోంది.
ఈక్రమంలోనే వైసీపీ నేతలు జనసేనానిని టార్గెట్ చేసేందుకు పోటీ పడుతున్నారు. నిన్న పవన్ కల్యాణ్ ప్రసంగం ఇలా పూర్తయిందో లేదో అప్పుడే మీడియా ముందుగా జగన్ కీలక అనుచరులు(మంత్రులు), ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ ప్రసంగంపై ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం స్టార్ట్ చేసేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని పాత పాటే పాడారు. అయితే వీరి ఏడుపంతా కూడా జనసేన, టీడీపీ కలువకూడదని అని మాత్రం స్పష్టమవుతోంది.
Also Read: పవన్ కళ్యాణ్ పై పడ్డ వైసీపీ నేతలు.. సమస్యలు వదిలేసి వ్యక్తిగత దాడి?
జనసేన-బీజేపీ కూటమికి టీడీపీ కూడా తోడైతే వచ్చే రిజల్ట్ ఏంటో వైసీపీ నాయకులకు తెలుసు. 2014లో వైసీపీని అధికారంలోకి రాకుండా నిలువరించింది కూడా ఈ కూటమే. దీంతో ఈ పార్టీలన్నీ మళ్లీ ఏకం కాకూడదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపికి కలిసి రావడంతో ఆపార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వచ్చింది. ఈ ఓటు చీలిపోతేనే వైసీపీకి మరోసారి అధికారం దక్కే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సైతం కొన్నివర్గాలను టార్గెట్ చేస్తూ ఓట్లు చీల్చే కార్యక్రమాన్ని ఇప్పటికే చేస్తోంది. దీనిని ముందుగానే గ్రహించిన పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా జనసేన కూటమికి పడాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే టీడీపీకి సైతం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో అధికారాన్ని దూరమైన టీడీపీ నాటి నుంచి జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తోంది. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం కొల్పోయినప్పుడు మరోలా ఉంటారు. దీంతో జనసైనికులు టీడీపీతో కలిసి నడిచేందుకు ఇష్టపడటం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో వైపీసీని గద్దె దించాలంటే మాత్రం జనసేన-బీజేపీ బలం సరిపోతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈక్రమంలోనే చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాలను విడిచి జనసేన కూటమితో కలిసి వస్తే తాను కలుపుకుపోవడానికి సిద్దమేననే సంకేతాలను పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభ నుంచి పంపించారు. ఇది ఒక రకంగా టీడీపీకి మరోసారి ఊపిరిపోసినట్లే అన్న కామెంట్స్ విన్పిస్తోంది. అయితే సీఎం సీటులో పవన్ కల్యాణ్ ను కూర్చోబెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏమేరకు సహకారం అందిస్తారనేది మాత్రం తేలాల్సి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేందుకు పని చేశారో ఇప్పుడు పవన్ సీఎం అయ్యేందుకు టీడీపీ పని చేయాలని జనసైనికులు అంటున్నారు. మరీ దీనిపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.
Also Read: వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను.. పొత్తులపై పవన్ సంచలన ప్రకటన