
తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండడంతో.. అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే పార్టీలు పోటాపోటీ ప్రచారం కొనసాగిస్తుండగా.. నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. ఇందులోభాగంగా ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేయనున్నారు. తిరుపతిలో ఇవాళ పాదయాత్రచేసి.. బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకోనున్న పవన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలో పాదయాత్ర చేస్తారు. ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగియనున్న శంకరంబాడి సర్కిల్ వద్ద సాయంత్రం పూట భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్లు జనసేన–బీజేపీ మధ్య కొనసాగిన అభిప్రాయ భేదాలతో ఇరు పార్టీల మధ్య సఖ్యత దెబ్బతింది. అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అలక వహించారు.
ఈ నేపథ్యంలో తిరుపతి సీటు బీజేపీకి దక్కడంతో అభ్యర్థి రత్నప్రభపై జనసైనికులు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ కీలక నేతలే వ్యాఖ్యలు చేశారు. కానీ.. ఈ మధ్య వాటన్నింటికీ చెక్ పెడుతూ జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని ఇరు పార్టీలు ఐక్యంగా ప్రకటన ఇచ్చాయి. ఈ క్రమంలో పవన్ తిరుపతి టూర్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. జనసేన అధినేతకు తిరుపతిలో గ్రాండ్ వెల్కమ్ పలికేలా ఏపీ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. పవన్ వెంట పాదయాత్రలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ–-జనసేన పొత్తు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ‘తిరుపతిలో పవన్ కల్యాణ్ పాదయాత్ర’ ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చీఫ్ నాదెండ్ల మనోహర్ ఇదివరకే వెల్లడించారు. పవన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు 4 రాయలసీమ జిల్లాల నుంచీ శ్రేణులు తిరుపతికి రానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకం కానుంది.