Pawan Kalyan: ఆ తల్లి కన్నీరు తుడిచి… చిన్నారితో చిరునవ్వులు చిందించి! వీరమహిళను కలిసిన పవన్ కళ్యాణ్

* విశాఖ పర్యటనలో జనసేన పార్టీకి అండగా నిలబడిన వారిని కలిసిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan: చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని… చేతిలో జనసేన జెండా పట్టుకుని రెండు రోజులపాటు విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద పవన్ కళ్యాణ్ కోసం అక్కడే నిలిచి పోరాట పటిమ చూపిన మాతృమూర్తి శ్రీమతి నులక గోవిందం , ఆమె భర్త విజయకుమార్ లను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఆదివారం అర్ధరాత్రి […]

Written By: NARESH, Updated On : October 18, 2022 9:28 pm
Follow us on

* విశాఖ పర్యటనలో జనసేన పార్టీకి అండగా నిలబడిన వారిని కలిసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని… చేతిలో జనసేన జెండా పట్టుకుని రెండు రోజులపాటు విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద పవన్ కళ్యాణ్ కోసం అక్కడే నిలిచి పోరాట పటిమ చూపిన మాతృమూర్తి శ్రీమతి నులక గోవిందం , ఆమె భర్త విజయకుమార్ లను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఆదివారం అర్ధరాత్రి వైజాగ్ శివారులో ఉన్న గోపాలపట్నంలోని ఇంటికి గోవిందం, విజయ్ కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల చిన్నారి వరలక్ష్మిని తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలో దారి కాచిన వైసీపీ గూండాలు వారి ఆటోని ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారిని పిలిపించుకొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆదివారం రాత్రి జరిగిన సంఘటనలను వారిద్దరూ పవన్ కళ్యాణ్ కి వివరించారు. శనివారం ఉదయం నుంచే నోవాటెల్ హోటల్ వద్దకు వచ్చామని తర్వాత పవన్ కళ్యాణ్ ర్యాలీలోను తాము పాల్గొన్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం పోర్టు కళావాణి స్టేడియంలో జనవాణి కార్యక్రమానికి వెళ్ళామని అయితే పవన్ కళ్యాణ్ రాకపోవడంతో మళ్లీ నోవాటెల్ హోటల్ వద్దకు చేరుకొని ఆదివారం రాత్రి అంతా అక్కడే ఉన్నట్లు చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి ఇంతసేపు బీచ్ రోడ్ లో ఉండకూడదని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. అయితే మార్గమధ్యంలోనే వైసీపీ గూండాలు తమపై దాడికి పాల్పడి ఆటోను ధ్వంసం చేసినట్లు ఇద్దరు దంపతులు బోరున విలపించారు. తమకు ఆటో జీవనాధారం అని చెప్పినప్పటికీ ఆటోలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి చిత్రాలను చింపేసి, ఆటోను పాక్షికంగా ధ్వసం చేసి 20 మంది దుండగులు వెళ్లిపోయారని చెప్పారు. బీచ్ రోడ్ లో కూడా ఆ రాత్రంతా ఉండాలని అనుకున్నామని అయితే పోలీసులు అక్కడ ఉండకూడదని పంపేయడంతో పాటు జెండాను కూడా తీసుకోవాలని చూశారని, అయితే నా ప్రాణం పోయినా జెండాను మాత్రం విడిచి పెట్టేది లేదని తెలిపానని శ్రీమతి గోవిందం చెప్పారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతూ ఎలాంటి భయం లేదని, పార్టీ తరఫున నాయకులు అంతా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫు నుంచి రూ. లక్ష చెక్కును వారికీ అందజేశారు. ఆటోకి మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. ఘటన జరిగిన వెంటనే జనసేన పార్టీ నాయకులు జుత్తాడ శ్రీనివాస్, పాతంశెట్టి శ్యాం సుందర్, కోరాడ రాజు, ప్రకాష్, శ్రీ నాయుడు తదితరులు తమకు సహకరించినట్లు ఈ సందర్బంగా చెప్పారు. వారిని పవన్ కళ్యాణ్ అభినందించారు.

* చిన్నారితో జనసేనాని ముచ్చట
ఐదేళ్ల హైందవి అనే చిన్నారి విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ ఎదురుగా జై జనసేన అంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఆ చిన్నారి ముచ్చటగా చేసిన జై జనసేన నినాదాలను చూసిన పవన్ కళ్యాణ్ ఆ పాపతో ముచ్చటించాలని భావించారు. చిన్నారి హైందవి తల్లిదండ్రులు పల్లా శివప్రసాద్, శ్రీమతి శ్రీదేవి దంపతులతో మాట్లాడారు. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసేందుకు కుటుంబంతో సహా వచ్చామని, అక్కడున్న వారి నినాదాలు చూసిన చిన్నారి హైందవి కూడా జై జనసేన అంటూ నినాదాలు చేసినట్లు తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కి చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారితో కాసేపు పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. తమకు మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానం అని ఈ సందర్భంగా హైందవి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కి తెలియజేశారు.