Pawan Kalyan: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని భావిస్తున్న పవన్.. వైసీపీ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్రిమినల్ ఆలోచనలను ఎండగట్టారు. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో పవన్ ఆగ్రహంగానే స్పందించారు. తాను జైలుకు వెళ్లాను కాబట్టి .. ప్రత్యర్ధులు సైతం వెళ్లాలనే ఆలోచన జగన్ ది అని చెప్పుకొచ్చారు. చట్టాలు సంపూర్ణంగా పని చేసి ఉంటే జగన్ అనే వ్యక్తి జన్మలో అయినా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి చీకటి రోజులని.. ప్రజలంతా మేల్కొనాల్సిన అవసరం ఉందని పవన్ తేల్చి చెప్పారు.
నాడు వారాహి యాత్రలో వైసీపీ సర్కార్ కుట్రను తాజాగా బయటపెట్టారు. కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిన సందర్భంలో శాంతి భద్రతల కు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించారని.. ఇందుకోసం 2000 మంది నేరగాళ్లను దింపారని.. కోనసీమలో 50 మందిని చంపేయాలని పథకం వేశారని పవన్ ఆరోపించారు. అయితే ఈ కుట్ర గురించి తెలుసుకున్న కేంద్ర పెద్దలు నిలువరించారని పవన్ చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి అక్రమానికి వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. ప్రభుత్వం మారిన వెంటనే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో దోచుకున్న మొత్తాన్ని లండన్ లో దాచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు పవన్ ఆరోపణలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చంద్రబాబు గురించి ఇంతలా ఎందుకు పరితపిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. అలా అడిగి అర్హత వైసిపి నేతలకు లేదని పవన్ తేల్చి చెప్పారు. విశాఖలో తనను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబును అక్రమంగా, కనీస నిబంధనలు పాటించకుండా అరెస్టు చేయడంపై తాను స్పందించానని చెప్పుకొచ్చారు. ఇలా స్పందించడం ఒక సంస్కారం అని వైసిపి నేతలకు గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను తాను గట్టిగానే ప్రశ్నిస్తానని.. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదన్నారు. తాను చివరి వరకు జగన్ అవినీతిపై పోరాడుతానని స్పష్టం చేశారు.
అయితే పవన్ దూకుడు చూసి వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్న హెచ్చరిక వారిని భయపెడుతోంది. చంద్రబాబు అరెస్టుతో టిడిపి, జనసేన మరింత దగ్గర అయ్యాయి అన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. అటు విపక్షాలు సైతం ఏకతాటిపై రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు కేంద్రం విషయం కూడా తెలియక వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి, ఆపై పవన్ దూకుడు చూస్తుంటే తమకు చిక్కులు ఖాయమని వైసీపీ నేతలు భయపడుతున్నారు.