Pawan Kalyan: 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు రచించినట్లు కనబడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో అధికార వైసీపీపైన పోరుకు సిద్ధమయ్యారు. ఆదివారం విశాఖ ఉక్కు కార్మికులకు అండగా నిలిస్తూ దీక్షలో కూర్చున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళన 300 రోజులకు చేరుకున్న నేపథ్యంలో వారికి నైతికంగా మద్దతు తెలిపేందుకుగాను పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ నిర్లక్ష్యం వహిస్తోందని, ఎంపీలు కనీసంగా పార్లమెంటులో నిరసన తెలపడం లేదని జనసేనాని పవన్ గతంలో విమర్శించారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులకు అండగా నిలిచేందుకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు తెలపడం ద్వారా ఆందోళన పై ఇంకా ఫోకస్ వచ్చే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: చంద్రబాబు బాటలో పవన్ కల్యాణ్.. టార్గెట్ వైసీపీ..!
ఇకపోతే మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే క్రమంలో పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వద్ద శ్రమదానం చేశారు. పార పట్టి కంకరను గుంతలో వేసి రోడ్డును బాగు చేశారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయ క్షేత్రంలో క్షేత్రస్థాయిలోకి రావడం ద్వారా జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన పవన్ కల్యాణ్‌ను ఎన్నికల్లో గెలిపించి ఏపీ అసెంబ్లీలోకి పంపాలని చర్చించుకుంటున్నారు పవన్ అభిమానులు.
ఏపీలో జనసేన బీజేపీతో మిత్రపక్షంగా ఉంది. అయినప్పటికీ కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు కార్మికులకు అండగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీక్షలో కూర్చున్నారు. సింగిల్ డే దీక్ష ద్వారా పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులకు నైతికంగా మద్దతు తెలుపుతున్నారు. విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు తెలిపేందుకు పవన్ కల్యాణ్ మంగళగిరికి వచ్చిన క్రమంలో జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు. జనసేన పార్టీలో మళ్లీ నూతనోత్తేజం వచ్చిందని పలువురు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: పవన్ మరో పోరాటం.. మిత్రుడు బీజేపీకి సంకటం