Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ పథకాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆధారంగా చూపి మరీ తూర్పారపట్టారు. ఒక్కో ప్రభుత్వ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఎండగడుతున్న తీరును ఒక్కో ట్వీట్ లో పవన్ ఎండగట్టారు. పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్నాయి.
-మొదటి ట్వీట్ ‘అప్పుడు అమ్మఒడి.. ఇప్పుడు అమ్మడానికో బడి’..
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలకు పెంచేందుకు అమలు చేసిన పథకం అమ్మఒడి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు సంవత్సరానికి రూ.15వేల వరకూ చెల్లించింది. ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలను వదిలించుకొని ఆ విద్యార్థులను రోడ్డున పడేసి ఆ భవనాలను అమ్ముకుంటోందని పవన్ కళ్యాణ్ జీవోలతో సహా విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వం నవంబర్ 12, 2021న మెమోను జారీ చేసిందని.. ఇది ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల మూసివేస్తూ తీసుకున్న నిర్ణయమని పవన్ విమర్శలు గుప్పించారు. ఈ పాఠశాలలను 4 విడతల్లో మూసివేసేందుకు వైసీపీ సర్కార్ కుట్ర పన్నుతోందని విమర్శించారు.
ఎయిడెడ్ పాఠశాలలను మూసివేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు & 6700 మంది ఉపాధ్యాయులు ఉన్న 2200 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందన్నారు. దాదాపు 71,000 మంది విద్యార్థులున్న 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు & దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులతో 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను ప్రభావితం అవుతాయన్నారు. విద్యార్థులు, సిబ్బందితో పాటు వారి కుటుంబాలు కూడా దెబ్బతింటాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం విద్యా సంస్థల మూసివేతతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ప్రక్రియలో విద్యార్థులను పూర్తిగా విస్మరించి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నామరని మండిపడ్డారు. ఈ వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ వారి భవిష్యత్తును చెడగొడుతోందని నిప్పులు చెరిగారు.
ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పవన్ విమర్శించారు. ఆ పాఠశాలల యాజమాన్యాలు, నిర్వాహకులను కనీసం సంప్రదించలేదని ఆడిపోసుకున్నారు. ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఎన్ని “ఫంక్షనల్” స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను కలిగి ఉన్నాయి? ఎస్.ఎంసీలు తమ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారా? ఎస్ఎంసీ లేకపోతే ఈ ప్రక్రియ ఎలా చెల్లుబాటవుతుంది? ఇది ఆర్టీఏ నిబంధనలను ఉల్లంఘించడం కాదా? అని పవన్ నిలదీశారు.
వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థలను విలీనం చేయడానికి/టేక్‌ఓవర్ చేయడానికి ఎందుకు తొందరపడుతోందని పవన్ ప్రశ్నించారు. విద్యార్థులు విద్యాసంవత్సరం మధ్యలో ఉండగా, ప్రభుత్వం ఈ అనాలోచిత విధానాన్ని తీసుకురావడంలో హేతుబద్ధత ఏమిటని నిలదీశారు. ఈ వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో విద్యార్థులను శిక్షిస్తోందని నిప్పులు చెరిగారు.
ఇక నిరుద్యోగులపై పవన్ గళమెత్తారు. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. ఎయిడెడ్ పాఠశాలలు – కళాశాలలను స్వాధీనం చేసుకోవాలని ఆలోచించే ముందు మీరు మొదట ఉపాధ్యాయులను మరియు లెక్చరర్లను నియమించడం మరిచిపోయారా? అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆధారాలు, జీవోలతో లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలో లేవనెత్తిన పవన్ ప్రశ్నల ఇంకా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. మరి దీనిపై ఏపీ మంత్రులు, అధినేతలు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.