Pawan Kalyan Birthday : అశేష అభిమాన ప్రాప్తుడు.. నిరాడంబరుడు.. ఆ క్వాలిటీనే పవన్ ను శిఖరాన నిలబెట్టింది!

Pawan Kalyan Birthday : విజయం వస్తే పొంగిపోడు.. అపజయం వస్తే కృంగిపోడు.. ఓ కర్మ యోగిలా తనకు అప్పగించిన పనులను పూర్తి చేస్తుంటాడు. అతడే ‘పవన్ కళ్యాణ్’. తెలుగునాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో ఎవరంటే అది మన పవర్ స్టార్ మాత్రమే. సినీ అభిమాన సంద్రం అండగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు ప్రజల మెప్పు పొంది సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. సినీ లోకంలో అగ్రస్థాయికి ఎదిగిన పవన్ .. రాజకీయాల్లో […]

Written By: NARESH, Updated On : September 2, 2022 9:07 am
Follow us on

Pawan Kalyan Birthday : విజయం వస్తే పొంగిపోడు.. అపజయం వస్తే కృంగిపోడు.. ఓ కర్మ యోగిలా తనకు అప్పగించిన పనులను పూర్తి చేస్తుంటాడు. అతడే ‘పవన్ కళ్యాణ్’. తెలుగునాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో ఎవరంటే అది మన పవర్ స్టార్ మాత్రమే. సినీ అభిమాన సంద్రం అండగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు ప్రజల మెప్పు పొంది సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. సినీ లోకంలో అగ్రస్థాయికి ఎదిగిన పవన్ .. రాజకీయాల్లో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ప్రజా సేవ కోసం పరితపిస్తున్నారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

సినీ పరిశ్రమ అంటే సక్సెస్ కే విలువ ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ లో ఉన్న వారి మాటే చెల్లుబాటు అవుతుంది. వారి చుట్టే ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంది. కానీ కొందరు నటులు మాత్రం సక్సెస్ లకు అతీతంగా తిరుగులేని స్టార్ డమ్ ను కలిగి ఉంటారు. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా వారి ఇమేజ్ తగ్గిపోదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కోవలోకి వచ్చేవారే పవన్ కళ్యాణ్. ఎన్ని ఫ్లాపులొచ్చినా కూడా అభిమానుల్లో పవన్ క్రేజ్ తగ్గదంటే అతిశయోక్తి కాదు.. హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మార్కెట్ ఉన్న ఏకైక హీరో మన పవన్ కళ్యాణ్ మాత్రమే.

-పవన్ కళ్యాణ్ బాల్యం, విద్యాభ్యాసం..
1968 సెప్టెంబర్2న కొణిదెల వెంకటరావు-అంజనాదేవికి పూడిమడకలో పవన్ కళ్యాణ్ జన్మించారు. ఇతడికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు చిరంజీవి, నాగబాబులు.ఇంటర్మీడియెట్ ను నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశారు. కంప్యూటర్స్ లో డిప్లొమో చదివారు. ఖాళీగా ఉంటున్న పవన్ ను సినిమాల వైపు మళ్లించాడు పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలంటే అస్సలు ఇష్టం లేని పవన్ అయిష్టంగానే ఆ ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటికీ పవన్ లో ఆ సిగ్గు, భయం పోలేదనడంలో అతిశయోక్తి కాదు. చిరంజీవి అండతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అభిమానుల అండతో పవర్ స్టార్ గా ఎదిగాడు.

-సీనీ ప్రస్థానం..
1996లో ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషిలతో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా రూపాంతరం చెందారు. పలు ఫ్లాపులు పలకరించినా ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో మరోసారి ట్రాక్ లోకి వచ్చి సత్తా చాటారు. గబ్బర్ సింగ్ చిత్రానికి గాను పవన్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. అత్తారింటికి దారేది వసూళ్లలో అప్పటివరకూ తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక నిర్మాతగానూ అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో సినిమాలు నిర్మించాడు. జానీ సినిమాకు దర్శకత్వం వహించారు. కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ గానూ సేవలందించారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి సినిమాల్లోనూ దాన్ని ప్రదర్శించారు.

-పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే గొప్ప అలంకరణ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలున్నా పవన్ కళ్యాణ్ లోని ఆ సేవాగుణం.. నిరాడంబరతనే అతడిని ప్రత్యేకంగా నిలిపింది. పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆయన డబ్బును ప్రజల కోసం.. బాధితుల కోసం తృణప్రాయంగా ఖర్చు చేస్తుంటారు. ఎన్ని కోట్లు అయినా ప్రజలకు పంచడానికి వెనుకాడరు. సూటు బూటు హంగామాలకు దూరంగా ఒక రైతుగా ఫాంహౌస్ లో సాదాసీదాగా జీవిస్తాడు. సమకాలీన హీరోలకు భిన్నంగా ఆలోచన ధోరణే ఆయనను ప్రజలకు, ఫ్యాన్స్ కు చేరువ చేసింది. చిత్ర సీమలో, రాజకీయాల్లో ప్రత్యేకస్థానాన్ని కట్టబెట్టింది.

– ఒడిదొడుకులతో రాజకీయ ప్రయాణం
2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందర జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ నాడు బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి వారికి రాజ్యాధికారం దక్కేలా చేశారు. అంతకుముందు అన్నయ్య ‘ప్రజారాజ్యం’ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా ఎదిగారు. 2019లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు రాలేదు. 2023 ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళుతున్నారు. ఈ దసరా నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టబోతున్నారు. జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర పేరిట జిల్లాల్లో పర్యటిస్తూ మరణించిన రైతు కుటుంబాలకు లక్ష చొప్పున విరాళం ఇస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన కోట్ల రూపాయలను రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు చేస్తున్నారు. జనవాణిలో ప్రజా సమస్యలు వింటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగాడానికి ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈసారి సీఎం కుర్చీ ఎక్కడమే ధ్యేయంగా కదులుతున్నారు..

సినీ ప్రయాణంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్, రాజకీయ ప్రయాణంలోనూ ఆ స్థాయిని అందుకోవడానికి పరితపిస్తున్నారు. ఆయన సేవాతత్పరతనే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆయన సైలెంట్ గా ఉన్నా ఆయన అభిమానుల సందడి మాత్రం పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో, బయటా పవన్ బర్త్ డే వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. oktelugu.com తరుఫున మనమూ పవర్ స్టార్ కు ‘జన్మదిన శుభాకాంక్షలు’ చెబుదాం..