Pawan Kalyan: పవన్ దూకుడు.. పత్తాలేని టీడీపీ

వారాహి యాత్ర ప్రారంభం నుంచి అందరి దృష్టి దానిపైనే. పవన్ చేసే వ్యాఖ్యల చుట్టూ డిబేట్లు, ప్రత్యేక కథనాలు నడుస్తున్నాయి. మరో పార్టీకి కానీ.. నాయకులకు కానీ స్పేస్ లేదు.

Written By: Dharma, Updated On : July 11, 2023 12:27 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ రాజకీయ సునామీ సృష్టిస్తున్నారు. తన మాటల తూటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థల తీరును ఎండగడుతున్నారు. దీంతో ఏపీలో పాలక పక్షం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎదురుదాడి చేస్తోంది. అయితే ప్రధాన విపక్షం టీడీపీ మాత్రం ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతోంది. పవన్ ఇలా ఏపీలో అడుగుపెడుతున్న మరుక్షణం మీడియా దృష్టంతా పవన్ పైనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సంచలన కామెంట్స్ చేసి పవన్ హీట్ పెంచుతున్నారు. ఎక్కడ ఆ వార్తలను మిస్సయిపోతామన్న భయం మీడియాను వెంటాడుతోంది. చివరకు ఎల్లో మీడియా సైతం పవన్ ను నిత్యం వాచ్ చేస్తూనే ఉంది.

వారాహి యాత్ర ప్రారంభం నుంచి అందరి దృష్టి దానిపైనే. పవన్ చేసే వ్యాఖ్యల చుట్టూ డిబేట్లు, ప్రత్యేక కథనాలు నడుస్తున్నాయి. మరో పార్టీకి కానీ.. నాయకులకు కానీ స్పేస్ లేదు. లైమ్ లైట్ లో ఉండే నాయకులు, వివాదాస్పద ప్రముఖులు సైతం సోదిలో లేకుండా పోతున్నారు. ఎప్పుడూ వారి వెంట పడే మీడియా .. ఇప్పుడు పవన్ వెంట పడుతోంది. ఎల్లో మీడియా అయితే తన ప్రాధాన్యతలను మార్చేస్తోంది. వైసీపీ సర్కారుపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో వాటినే పతాక శీర్షికన కథనాలు, వార్తలు రాస్తున్నాయి. చివరాఖరుకు తాము అభిమానించి, ఆరాధించే చంద్రబాబు, లోకేష్ బాబులను సైతం పక్కన పడేస్తున్నారు.

లోకేష్ యువగళం పాదయాత్రను ఎల్లో మీడియా బాగానే కవరేజ్ చేస్తోంది. గత ఆరు నెలలుగా ప్రాధాన్యత ఇస్తోంది. అయితే అది పవన్ బయటకు రానంత వరకే. సాధారణ రోజుల్లో యువగళం యాత్రను సక్సెస్ చేయడానికి కిందా మీదా పడుతున్న ఎల్లో మీడియా.. పవన్ ఏపీలో అడుగుపెట్టేసరికి కెమెరాలను పక్కకు తిప్పాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. తొలి విడత వారాహి యాత్ర నుంచి.. తాజాగా రెండో విడత పవన్ యాత్రను చూస్తే అది ఇట్టే అర్ధమైపోతోంది. పవన్ ను పతాక శీర్షికన పెడితే.. లోకేష్ ది ఎక్కడో చివరి పేజీలో చూపిస్తున్నారు. ఒకవేళ ఒకే పేజీలో చూపించాలనుకున్న పవన్ వార్త ముందు లోకేష్ ది తేలిపోతోంది.

పవన్ అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు కనుక వైసీపీలో కలవరం సాధారణం. అయితే ఇప్పుడు టీడీపీని సైతం అదే కలవరం వెంటాడుతోంది. పవన్ రెండు విడతల వారాహి యాత్ర చేసేసరికి పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో పొత్తుల పెచీలు ఎదురవుతాయన్న భయం పచ్చపార్టీని తెగ భయపెడుతోంది. చివరకు తాము అభిమానించే ఎల్లో మీడియా సైతం పవన్ వైపు వెంపర్లాడుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. మున్ముందు ఇది ఎలాంటి రాజకీయ సమీకరణలకు దారితీస్తుందోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. టీడీపీ వెనుకబడిపోతుందన్న ఆందోళన వారి కంటిమీద కునుకు ఉంచడం లేదు.