
RRR – Talasani : ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సంబురాలు మిన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నాటు నాటు గురించే చర్చ జరుగుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏ సామాజిక వేదిక చూసుకున్నా దీని ప్రస్తావనే సాగుతోంది. నాటు నాటు ఆస్కార్ అవార్డు సాధించిన క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూర్మా చలం అనిల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై బీజేపీ కుట్ర పన్నింది. ఇంతటి గొప్ప చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీలకు పంపకుండా అడ్డుకున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాలు తమ సొంత రాష్ట్రమైన గుజరాత్ చిత్రం చెల్లెషోను ఆస్కార్ ఎంట్రీలకు పంపారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని అణగదొక్కారు. కానీ వారి ఆటలు సాగలేదు. ఆస్కార్ అవార్డు కమిటీ చెల్లెషో సినిమాను పక్కనపెట్టి ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు అవార్డు ఇచ్చింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం ద్వారా తెలంగాణ సినిమా స్థాయి పెరిగిందని తలసాని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి, నిర్మించిన దానయ్య, పాట రాసిన చంద్రబోస్, పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను తలసాని శ్రీనివాస్‌యాదవ్ అభినందించారు. అంతే కాదు కేంద్రంలోని బేజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. గుజరాత్ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీలకు పంపినప్పటికీ రాజమౌళి తన ప్రతిభ ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అవార్డు వచ్చేలా కృషి చేశారని కొనియాడారు. అంతే కాదు తెలంగాణ సినిమా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల నేడు ప్రపంచ స్థాయి పురస్కారాలు వస్తున్నాయని కితాబిచ్చారు. తెలంగాణ సినిమా అభివృద్ధికి మరింత కృషి చేస్తుందని తలసాని పేర్కొన్నారు.