Free Bus Travel: తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి.
ఆ బస్సుల్లో మాత్రమే ఉచితం..
ఉచిత ప్రయాణం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మత్రమే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సిటీలో ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మొదటి వారం ఎలాంటి ప్రూఫ్ లేకుండానే..
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఫోటో గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్ చూపించినా సరే బస్సుల్లో ప్రయాణానికి అనుమతించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం శక్తి స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది. తెలంగాణలో మాత్రం మొదటి వారం రోజులు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ప్రయాణించవచ్చని ఆర్డీసీ ఎండీ తెలిపారు. తర్వాత గుర్తింపు కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాలకు వెళ్లు బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుంది. సరిహద్దు దాటాక చార్జి మేరకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. డీలక్స్, సూపర్ డీలక్స్, గరుడ, లగ్జరీ, సెమీ లగ్జరీ, ఏసీ, ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ఉచిత ప్రయాణం ఉండదు.