Olive Mithai Dora Raju : ‘డబ్బులు ఊరికే రావు’ అని ఓ జ్యూవెల్లర్స్ కంపెనీ యజమాని టీవీలో ప్రకటన చూస్తే.. కష్టపడి సంపాదించిన సొమ్మును ఎలా భద్రంగా దాచుకోవాలి.. ఖర్చు చేయాలన్న దానిపై జనాలు ఎంతలా ఆలోచిస్తారో అర్థమవుతుంది. ప్రతి రూపాయిని ఇప్పటికీ పద్ధతిగా ఖర్చు పెట్టేవారు ఉంటారు. దానం చేయడానికి ఎవరీకీ మనసు రాదు. అంత పెద్ద కోటీశ్వరుడు అదానీ సైతం పెద్దగా సేవా కార్యక్రమాలు చేయరంటూ అతిశయోక్తి కాదేమో.. కానీ మన ‘దొరరాజు’ మాత్రం నిజంగానే మనసు దోచేశాడు. ఆయన సేవా నిరతికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10/10 మార్కులు సాధించిన వారి కోసం రూ.1 లక్ష నగదు అందించేందుకు ఆలివ్ మిఠాయి యజమాని దొరరాజు ముందుకు రావడం నిజంగా అభినందనీయం. సర్కారు పాఠశాలల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ప్రోత్సాహకాలు అందించడం గర్వకారణం. దీంతో వారు భవిష్యత్ లో మరింత దూసుకుపోయే అవకాశాలున్నాయి. నగరంలోని కేపీహెచ్ బీ కాలనీలోని తబలా హోటల్ లో ఆలివ్ మిఠాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో విద్యార్థులకు నగదు, ల్యాప్ టాప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించిన వారు ఉన్నారు. దీంతో వారికి ఎమ్మెల్యే సమక్షంలో వాటిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో హర్షం వ్యక్తమైంది. మాకు లభించిన ఈ అదృష్టంతో జీవితంలో ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తామని చెబుతున్నారు. కష్టపడి చదివి ఈ మార్కులు తెచ్చుకున్నట్లు చెప్పడం గమనార్హం. దీంతో వారు తమ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తమ వంత ప్రయత్నాలు చేస్తామన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. భవిష్యత్ లో అన్ని పాఠశాల భవనాలు వెలుగులతో అలరించనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఉందని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడంతో ఇంకా మరికొందరు విద్యార్థులు కూడా బాగా చదివేందుకు సిద్ధపడనున్నారు.

ఆలివ్ మిఠాయి యజమాని దొరరాజు (Olive Mithai Dora Raju) ఉదార స్వభావానికి అందరు ఫిదా అవుతున్నారు. డబ్బు ప్రతి వారి దగ్గర ఉంటుంది కానీ దయా గుణం కొందరికే ఉంటుంది. అది కూడా విద్యాలయాల్లో సేవా భావంతో ప్రోత్సాహకాలు అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ప్రతి సంవత్సరం ఆయన అందించే ప్రోత్సాహకాల కోసం విద్యార్థుల్లో పోటీతత్వం ఏర్పడి మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదువుతారని చెబుతున్నారు. వారిలో మంచి పోటీతత్వం నింపిన దొరబాబు సేవలను అందరు ప్రశంసిస్తున్నారు.

