శేఖర్ రెడ్డి.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. టీటీడీ బోర్డు సభ్యుడిగా చంద్రబాబు హయాంలో వెలుగు వెలిగిన నేత. అయితే ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్దనోట్లను రద్దు చేయగానే శేఖర్ రెడ్డి వద్ద భారీగా కొత్త నోట్లు.. బంగారం కడ్డీలు దొరికాయి. రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రజలంతా పైసల కోసం బ్యాంకుల ముందు క్యూలు కడితే దాదాపు 34 కోట్ల రెండు వేల రూపాయలు మొత్తంగా రూ.240 కోట్ల వరకు పాత, కొత్త నోట్లు లభించడం సంచలనమైంది.
అప్పట్లో చంద్రబాబు ఇదే శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడి పదవి నుంచి తొలగించారు. నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆయన మళ్లీ టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఐటీశాఖ, సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం. లైవ్ లో దొరికినా కూడా శేఖర్ రెడ్డి పై ఆధారాలు లేవంటూ సీబీఐ చెప్పడం చర్చనీయాంశమైంది. అదంతా వ్యాపారం సొమ్ము అని లెక్కలు చూపించినట్టు సమాచారం.
పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త టీటీడీ బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో పాత నోట్లను రద్దు చేసిన సమయంలో నిబంధనలు అతిక్రమిస్తూ భారీగా పాతనోట్ల మార్పిడికి శేఖర్ రెడ్డి పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. భారీగా ఆయన ఇంట్లో పాత నోట్లను పట్టుకున్నారు. వివిధ బ్యాంకుల ద్వారా భారీగా పాతనోట్ల మార్పిడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా 247.13 కోట్లు దారి మళ్లించారని ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ నమోదు చేశారు.
ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం.. సరైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని తెలిపింది. దీంతో ఈ కేసును మూసివేస్తున్నట్లు తెలిపింది. పాతనోట్లు నగదు చెలామణీ నేరంతో సీబీఐ నమోదుచేసిన రెండు కేసులను చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది. శేఖర్ రెడ్డితోపాటు ఇదే కేసులో ఉన్న మరో ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చింది.
2016లో ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు బడా బాబులు, వ్యాపారవేత్తలు దాచుకున్న నల్లడబ్బును తెల్లగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో కుప్పలు తెప్పలుగా పాతనోట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే.. శేఖర్ రెడ్డి వద్ద కూడా భారీగా డబ్బుదొరికినా ఆయన ఆ కేసు నుంచి బయటపడడం విశేషం.