Baikunthanath Behera: ఎవరైనా సరే జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెడతారు. కష్టపడి పనిచేసినవారు ఎదుగుతారు. కష్టాన్ని తట్టుకోలేక మధ్యలో వదిలేసినవారు అక్కడే ఉండిపోతారు. ఇతడు కూడా తన జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెట్టాడు.. కాదు కాదు 6000 నుంచి మొదలుపెట్టాడు. అదేంటి 6000 అంటున్నారు అనే ప్రశ్న మీ నుంచి వ్యక్తమవుతుందని మాకు తెలుసు. అయితే ఇంకెందుకు లేటు.. చదివేయండి ఈ స్టోరీ.. మామూలుగా ఉండదు..
అది ఒడిశా రాష్ట్రం. అక్కడి ఐటీడీఏ కార్యాలయంలో ఏఈఈ బైకుంఠనాథ్ బెహరా పని చేస్తున్నారు. ఈయన ప్రారంభ వేతనం 6000 మాత్రమే.. ఆ తర్వాత సార్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారో.. అప్పటినుంచి ఆయన తన ఆలోచన ధోరణి మొత్తాన్ని మార్చుకున్నారు. కేవలం సంపాదనకు మాత్రమే అలవాటు పడ్డారు. అది కూడా మామూలు సంపాదన కాదు.. అవినీతి, అక్రమం కలబోతతో సంపాదించుకున్న సంపాదన.
ప్రతిపనికి ఒక రేటు నిర్ణయించుకున్నారు.. డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నారు. ఐటీడీఏలో ఒక సమాంతర వ్యవస్థను నడపడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే కోట్లకు ఎదిగిపోయారు. సదరు సార్ ఒకే చోట పనిచేసేవారు. పైగా బదిలీలు లేకుండా చూసుకునేవారు. తద్వారా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడం మాత్రమే కాదు.. పది తరాలు కూర్చొని తిన్నా కూడా ఒడవని ఆస్తులను సంపాదించుకున్నారు.
రోజులు మొత్తం ఒకేలా ఉండవు కదా.. బెహరా అవినీతి వ్యవహారం బయటపడడం మొదలైంది. ఇతడి అక్రమాలు వెలుగులోకి రావడం స్టార్ట్ అయింది. ఒడిశా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. బెహరా చిట్టా మొత్తం విప్పడం ప్రారంభించారు.. మొత్తంగా బ్యాంకు లాకర్లలో రెండు కోట్ల విలువైన నగదు గుర్తించారు. బంగారం.. ఇతర ఖరీదైన లోహాలు ఇతడి వద్ద బాగానే ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు.. ఐదు భవనాలు.. 13 ఫ్లాట్లు ఇతడి వద్ద ఉన్నాయి.
అధికారులకే దిమ్మ తిరిగిపోయే స్థాయిలో ఇతడి సంపాదన ఉండడంతో ఒడిశాలో సంచలనంగా మారింది. అవినీతి అధికారుల మీద ఒడిశా ప్రభుత్వం కొద్దిరోజులుగా ఉక్కు పాదం మోపుతోంది.. ఇంతవరకు అక్కడి అధికారులు ఎంతోమంది అవినీతిపరులైన ఆఫీసర్లను పట్టుకున్నారు. కానీ ఈ స్థాయిలో అవినీతి తిమింగలాన్ని తాము చూడలేదని వారు చెబుతున్నారు అంటే.. బెహరా సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 6000 తో మొదలైన జీవితం కోట్లకి ఎదిగింది. ఈ కథనం ప్రారంభంలో శీర్షిక చదివి ఇదేదో బిజినెస్ మాన్ స్టోరీ అనుకున్నారు కదా.. కాదు కాదు కరప్షన్ ఆఫీసర్ డర్టీ పిక్చర్..
