
ZP Chairmans in AP : ఆంధ్రప్రదేశ్ లో తాజాగా విడుదలైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ప్రభంజనం సృష్టించింది. జడ్పీటీసీలు(ZPTC), ఎంపీటీసీ(MPTC)లను ఊహించని స్థాయిలో గెలుచుకుంది. వైసీపీ(YCP) ఫ్యాన్ గాలికి విపక్షాలు కొట్టుకుపోయాయనే చెప్పాలి. రాష్ట్రంలో 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 502 చోట్ల వైసీపీ విజయం సాధించడం విశేషం. ఈ ఫలితాలతో దాదాపు వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్టైంది.
నిజానికి ఈ స్థాయి ఏకపక్ష తీర్పును ఎవ్వరూ ఊహించి ఉండరు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. కేవలం 6 జడ్పీటీసీ స్థానాలు మాత్రమే దక్కించుకుంది. రెండు చోట్ల జనసేన, సీపీఎం ఒక చోట, ఇండిపెండెంట్ అభ్యర్థి మరోచోట గెలుపొందారు. బీజేపీ అసలు ఖాతానే తెరవకపోవడం గమనార్హం.
ఎంపీటీసీల్లోనూ ఇదే ఫలితం పునరావృతమైంది. మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగ్గా.. 5,998 చోట్ల వైసీపీ, 826 చోట్ల టీడీపీ, 177 స్థానాల్లో జనసేన, 28 చోట్ల బీజేపీ, 15 స్థానాల్లో సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 సీట్లలో స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వచ్చిన ఫలితాల ప్రకారం.. జడ్పీ చైర్మన్ సీట్లన్నీ అధికార పార్టీకే దక్కనున్నాయి. ముందుగా 24వ తేదీన ఎంపీపీ ఎన్నిక జరగనుంది. 25వ తేదీన జడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కనుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మరి, వారు ఎవరు? అన్నది చూద్దాం.
అనంతపురం-గిరిజ, చిత్తూరు-వి.శ్రీనివాసులు, కర్నూలు-రామసుబ్బారె్డి, కడప-ఆకేపాటి అమర్నాథరెడ్డి, నెల్లూరు-ఆనం అరుణమ్మ, ప్రకాశం జిల్లా-బూచేపల్లి వెంకాయమ్మ, గుంటూరు-క్రిస్టినా, కృష్ణా-ఉప్పాళ్ల హారిక, పశ్చిమగోదావరి-కవురు శ్రీనివాస్, తూర్పుగోదావరి-విప్పర్తి వేణుగోపాల్, విశాఖపట్నం-శివరత్నం, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం-పిరియా విజయ.