Tidco Houses: టిడ్కో ఇళ్ల పథకం విషయంలో లబ్ధిదారులు దారుణ వంచనకు గురయ్యారు. తిలాపాపం తలోపిడికెడు అన్నట్టు టిట్కో ఇళ్ల విషయంలో చంద్రబాబుతో పాటు జగన్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి కూడా ఉంది. కిస్తీలు చెల్లించ లేదంటూ బ్యాంకు నుంచి ఏకంగా లబ్ధిదారులకు స్వాధీన హెచ్చరిక రావడం ఆందోళన కలిగిస్తోంది. అసలు గృహప్రవేశమే చేయని ఇంటికి ఎలా కిస్తీలు చెల్లించాలంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రం 21 మంది పేర్లతో పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
టిడిపి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సింహభాగం సాయంతో టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించాలని భావించారు. కానీ సకాలంలో చంద్రబాబు సర్కార్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. మూడు కేటగిరిలో టిట్కో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. కేటగిరి 1 కింద 300 చదరపు అడుగుల ప్లాట్లను ఉచితంగా ఇస్తామని, కేటగిరి2 లో 365 చదరపు అడుగుల ప్లాట్లకు రూ.3.15 లక్షలు, 430 చదరపు అడుగుల ప్లాట్లను రూ.3.65 లక్షలను బ్యాంకుల వద్ద లబ్ధిదారులకు రుణాలు ఇప్పించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట 2018లో ఈ ప్రక్రియ పూర్తయింది. కానీ ఇళ్ల నిర్మాణాలను మాత్రం పూర్తి చేయలేకపోయారు. ఇంతలో ఎన్నికలు రావడం.. అధికార మార్పిడి జరగడం పూర్తయ్యింది. కానీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైసీపీ సర్కార్ ఇళ్ల నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ఎడతెగని జాప్యం జరిగింది.
ఈ ఇళ్ల విషయంలో వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం జగన్ స్పందించాల్సి వచ్చింది. ఈ ఏడాది మేలో టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేసినట్లు ప్రకటించి… చేతిలో రెండు పట్టాలు పెట్టి మమ అనిపించారు. కానీ ఇంతవరకు లబ్ధిదారులు గృహప్రవేశం చేయలేదు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడమే అందుకు కారణం. కానీ గృహ స్వాధీన పత్రాలపై ముందుగానే అధికారులు లబ్ధిదారులతో సంతకం చేయించారు. వాటిని సంబంధిత బ్యాంకు అధికారులకు అందజేశారు. ఇంకా గృహప్రవేశమే చేయని నేపథ్యంలో సులభ వాయిదా పద్ధతిలో లబ్ధిదారులు రుణాలు కట్టలేదు. దీంతో రుణ ఎగవేత దారులుగా భావించి బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఏకంగా పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ ఏడాది జూలై 1 నుంచి రుణ బకాయిలు చెల్లించని కారణంగా.. సంబంధిత లబ్ధిదారుల ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని బ్యాంకులు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం విశేషం. అయితే పత్రికల్లో తమ పేర్లను చూసి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అప్పుడు చంద్రబాబు సర్కార్ ఇళ్ల నిర్మానాన్ని పూర్తి చేయకుండా మోసం చేయగా.. ఇప్పుడు జగన్ సర్కార్ వాటిని పూర్తి చేయకుండానే బ్యాంకులకు స్వాధీన పత్రాలు సమర్పించడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు నమ్మి నిలువునా మోసపోయామని.. రుణ ఎగవేతదారులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.