NGT : వైసీపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపట్టడంపై తమిళనాడు హై కోర్టు నుంచి చివాట్లు పెట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే పలు విషయాల్లో తప్పటడుగులు వేసి ఏపీ హై కోర్టు నుంచి పలుమార్లు మొట్టికాయలు వేయించుకుంటూనే ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రం చెన్నై హై కోర్టు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడటంతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. తక్షణమే ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశించింది.
చిత్తూరు జిల్లాకు కృష్ణా నదీ జలాలను తరలించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముదివేడు వద్ద రెండు టీఎంసీలు, నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ, ఆవులపల్లి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2,144.50 కోట్లను మంజూరు చేసింది. వీటిని నిర్మించేందుకు పర్యావరణ అనుమతులు అవసరం. ఇరు రాష్ట్రాల సమీప గ్రామాల్లో ఏర్పడబోయే పరిస్థితులను మధింపు చేసుకొని కేంద్రం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
అయితే, ఆవులపల్లి , ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల అనుమతుల కోసం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కంపెనీ ఫీజు చెల్లించింది. మూడు కంపెనీలకు కలిపి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, కేవలం ఆవులపల్లి రిజర్వాయర్ కు మాత్రమే అనుమతులు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను చూపుతూ మూడు రిజర్వాయర్లను ప్రారంభించింది. దీనిపై పర్యావరణ నిపుణుడు గుత్తా గుణశేఖర్ చెన్నై హై కోర్టును ఆశ్రయించాడు.
పిటీషన్ ను విచారించిన జస్టిస్ పుష్ప సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్‌లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. రిజర్వాయర్ల నిర్మాణంలో పర్యావరణ అనుమతులు తీసుకోలేదని తేల్చింది. వెంటనే ఆవులపల్లి , ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఒక్క రిజర్వాయర్ కు అనుమతి తీసుకొని మూడింటి నిర్మాణం చేపట్టడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.