PM Modi- Eenadu: జవహర్ లాల్ నెహ్రూ.. ఈ పేరు వింటేనే నరేంద్ర మోడీకి ఎక్కడో కాలుతుంది. వీలు చిక్కినప్పుడల్లా నరేంద్ర మోడీ నెహ్రూ పై విరుచుకుపడుతూనే ఉంటారు. మొన్న గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా దేశంలో ప్రస్తుత అల్లకల్లోల పరిస్థితికి నెహ్రూ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని విమర్శించారు. మరుసటిరోజే అమిత్ షా కూడా నెహ్రూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల ఆ ఫలితాన్ని నేడు భారతదేశం మొత్తం అనుభవిస్తుందని ఆరోపించారు. కాశ్మీర్ రావణకాష్టంలా రగులుతుండడానికి కారణం నెహ్రూ నేనని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వం మొదటి దఫా అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి నెహ్రూ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. పైగా గాంధీ మహాత్ముడు పేరుతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఓన్ చేసుకుంది. గుజరాత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

-ఈనాడు కూడా మోడీ బాటనే అనుసరిస్తోంది
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల పాటు రామోజీరావు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించారు. కానీ ఉన్నట్టుండి ఎక్కడ చెడిందో ఏమో గాని.. జగన్ పై మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు పై పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయడం ప్రారంభించారు. దీనికి తోడు ఆ మధ్య అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడు నేరుగా ఫిలిం సిటీ లోని రామోజీరావు వద్దకు వెళ్లి చాలాసేపు వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే రామోజీరావు మళ్ళీ బిజెపితో అంట కాగుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు, బిజెపి మధ్య ఆయన సంధి కుదిర్చినట్టు సమాచారం. అయితే ఈ విషయం గురించి కొత్త గొప్ప సమాచారం తెలిసిన జగన్ సరికొత్త ఎత్తుగడకు తెర తీశాడు.
-తెరపైకి మళ్లీ మార్గదర్శి కేసు
ఈనాడు రామోజీరావుకు ఎన్ని వ్యాపారాలు ఉన్నప్పటికీ.. వాటి అన్నింటికీ మూలం మార్గదర్శి. ఇవాళ్టికి నాలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఏటా 7వేల టర్నోవర్ నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ లో జరిగిన అవకతవకలపై అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇది అనేక విచారణలు ఎదుర్కొన్న తర్వాత రామోజీరావు తనకున్న రాజకీయ బలంతో దానిని నిలిపేయించాడు. అయితే ఇప్పుడు ఆ కేసు తెరపైకి రావడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అందులో ఇంప్లిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ కేసు నుంచి కాపాడమని ఈనాడు ఎండి కిరణ్, సతీమణి శైలజ, ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి తో కలిసి 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల నేపథ్యంలో ఈనాడులో ప్రచురించిన వివిధ కథనాలను ఇమ్మోర్టల్ సాగా/ అమృత గాథ పేరిట సంకలనంగా అచ్చేసి నరేంద్ర మోడీతో ఆవిష్కరింపజేశారు. అయితే ఈ సంకలనం ముందు పేజీలో గాని.. లోపలి పేజీలో గాని భారత దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రస్తావన తీసుకురాలేదు. మోడీకి నెహ్రూ అంటే ఇష్టం ఉండదు కాబట్టే ఈ సంకలనంలో ఆయన ఫోటో ప్రచురించలేదని తెలుస్తోంది.

మార్గదర్శి కేసులో జగన్ ఉరుముతున్న నేపథ్యంలో రామోజీరావు కుటుంబం మోడీ శరణు జొచ్చింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీకి ఇష్టం లేదు కాబట్టి నెహ్రూ ఫోటో ప్రచురించేందుకు కూడా ఈనాడు అంత ఆసక్తి చెప్పలేదు. మోడీని ఇలా ‘అమృతగాథ’తో కూల్ చేసి తమపై కేసుల ఉచ్చును తొలగించుకునేందుకే ఈనాడు పెద్దలు ఇలా శరణువేడారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏ ఎండకు ఆ గొడుగు.. ఆ సామెతకు అర్థం బహుశా ఇదే కాబోలు.