Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్ర పై మరోసారి చర్చ నడుస్తోంది. తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. పూర్తిగా షెడ్యూల్ కుదించి పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది.ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడ వరకు వెళ్లే పరిస్థితి ఉన్నదని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. రాయలసీమలో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. కోస్తా జిల్లాల్లో సైతం యాత్ర దిగ్విజయంగా జరిగింది. సరిగ్గా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లో పాదయాత్ర కొనసాగుతుండగా… చంద్రబాబు అరెస్టు జరిగింది. సరిగ్గా సెప్టెంబర్ 9న లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. తండ్రి కేసులను పర్యవేక్షించారు. 52 రోజులపాటు చంద్రబాబు జైల్లో గడపాల్సి వచ్చింది. ఆయనకు మధ్యంతర బెయిల్ దక్కినా.. లోకేష్ పాదయాత్ర విషయంలో క్లారిటీ రాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అయితే తాజా సమాచారం మేరకు ఈ నెల 24న లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆగిపోయిన చోట అంటే రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర పునః ప్రారంభిస్తారని తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తీర్పు ఆలస్యమైనా 24 నుంచి పాదయాత్ర పున ప్రారంభించాలన్న యోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే గత షెడ్యూల్ మాదిరిగా ఇచ్ఛాపురం వరకు కాకుండా… విశాఖతో పాదయాత్ర ముగిస్తారని సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. కొద్దిరోజుల పాటు పాదయాత్ర చేసి విశాఖలో ముగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందిందని.. విశాఖలో ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ హై కమాండ్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.