Nara Lokesh : ఏపీలో చేసిన ఆందోళన ఇంకా సద్దుమణగలేదు.. ఇక జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ ను ఎలుగెత్తి చాటడానికి నారా లోకేష్ రెడీ అయ్యారు. ఈరోజు పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో కలిసి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించిన నారా లోకేష్ ఆ తర్వాత ప్లాన్ మార్చాడు. స్థానిక మీడియాతో మాట్లాడి జగన్ ప్రభుత్వంపై పోరాటం షురూ చేశానని ప్రకటించిన లోకేష్ అన్నంత పని షురూ చేశాడు. జాతీయ స్థాయిలో జగన్ పరువు తీయడానికి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలు దేరాడు. రాజమండ్రి నుండి ప్రత్యేక విమానం లో ఢిల్లీ బయలు దేరిన నారా లోకేష్ అక్కడ కీలక సమాలోచనల దిశగా లాబీయింగ్ మొదలుపెట్టారు.
చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియాతో లోకేష్ మాట్లాడడానికి రెడీ అయ్యారు. జాతీయ స్తాయిలో జగన్ ను విలన్ ను చేసే బాధ్యతను భుజానకెత్తుకున్నాడు. రాష్ట్ర పరిస్థితులను జాతీయస్థాయిలో వివరించేందుకు లోకేశ్ దిల్లీ పర్యటన పెట్టుకున్నారు.
ఇక చంద్రబాబుపై కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చించనున్నారు. ఈ మేరకు తన తండ్రిని కేసుల బారి నుంచి బయటపడేసేందుకు పక్కా స్కెచ్ గీసినట్టు సమాచారం.
ఇక పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం రూపొందించింది. దీన్ని అమలు చేసి జగన్ సర్కార్ ను పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని చతుర్ముఖ వ్యూహం రూపొందించారు. చంద్రబాబు అరెస్ట్ పై లోక్సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేశ్ మాట్లాడనున్నారు.
ఇలా తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. జాతీయ స్థాయిలో జగన్ ను టార్గెట్ చేసి పరువు తీయడానికి లోకేష్ రెడీ అయిపోయారు.