వైసీపీ ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ సందర్భంగా ‘విధ్వంసానికి ఒక్క చాన్స్’ పేరుతో ఏడాది పాలనపై చార్జి షీట్ ను రూపొందించింది. ఈ పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేశారు. మంగళగిరి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో జగన్ సాధించినవి నవ మోసాలు, నవ భారాలు, నవ స్కామ్ లు, నవ అబద్ధాలు, నవ రాజ్యాంగ ధిక్కరణలు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు, నవ మళ్లింపులు అని చెప్పారు.
వైసీపీ ఏడాది పాలనలో స్కామ్ ల గురించి మాట్లాడాలంటే ఇంకో సంవత్సరం పడుతుందన్నారు. రోడ్డుపై పేద ప్రజలు ఏడుస్తుంటే జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకున్నారని తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తలే వారి పార్టీ గురించి మాట్లాడుతున్నారని, ఇంత దారుణమైన, పనికి మాలిన పాలన చూడలేదంటున్నారని చెప్పారు. రాష్ట్రమంతా కుంభకోణాలు, అరాచకాలే. వైసీపీ సారా అక్రమాలపై పై స్వయంగా స్పీకరే చెప్పారు. వైసీపీ ఏడాది పాలనలో 564మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 64 లక్షలమందికి రైతు భరోసా అని 45 లక్షలకు కుదించారని, అవ్వా తాతలకు వెయ్యి పెన్షన్ పెంచుతానని చెప్పి కేవలం రూ. 250 పెంచారన్నారు.
ఏపీలో జగన్ రెడ్డి మద్యం దుకాణాలు చూస్తున్నామని, చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అమ్మఒడి అర్ధఒడిగా మారింది. 83 లక్షలమంది పిల్లలకు అమ్మఒడి అని చెప్పి 43 లక్షలమందికి మాత్రమే ఇచ్చారు. నేడు ట్రాక్టర్ ఇసుక 10,000 లారీ ఇసుక 50,000 వీరి ధన దాహం వల్ల 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, 40 లక్షలమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతోందన్నారు. సొంత బాబాయి చనిపోతే సీబీఐ విచారణ జరిపించలేకపోయారని, మీరు చేసిన దారుణాలు బయటపడతాయనేగా కేసు విషయంలో ముందుకెళ్లడం లేదని విమర్శించారు.