Nara Brahmani : చంద్రబాబు అరెస్ట్ తో నారా బ్రాహ్మణీ సంచలన నిర్ణయం

నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా 200 రోజులు పాటు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. సరిగ్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగింది.

Written By: Dharma, Updated On : September 23, 2023 11:06 am

Nara Brahmani

Follow us on

Nara Brahmani: తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఆయన వారసుడు లోకేష్ ను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో ఆ పార్టీలో నందమూరి బాలకృష్ణ, ఆయన కుమార్తె బ్రాహ్మణి, చంద్రబాబు భార్య భువనేశ్వరి యాక్టివ్ అయ్యారు. టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నారు. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. నారా బ్రాహ్మణితో పాదయాత్రకు టిడిపి నేతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా 200 రోజులు పాటు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. సరిగ్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన కదలికలపై ఏపీ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లోకేష్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మిగతా పాదయాత్ర పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో అందరి దృష్టి బ్రాహ్మణి పై పడింది. భర్త చేపట్టాల్సిన యాత్రను.. తాను ముందుండి నడిపించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. దీంతో ఆమె పాదయాత్రకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

2014ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. కానీ అప్పట్లో కేసులు చుట్టుముట్టడంతో పాదయాత్ర బాధ్యతను సోదరి షర్మిల తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. అటు తల్లి విజయలక్ష్మి సైతం రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు కుటుంబానికి కూడా అదే పరిస్థితి. తండ్రీ కొడుకులు ఇద్దరూ జైల్లోకి వెళితే.. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత భువనేశ్వరి, బ్రాహ్మణిల పై ఖచ్చితంగా పడుతుంది. అయితే ఇప్పటివరకు వారు రాజకీయ వేదికలపై వచ్చింది తక్కువ.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి తో పాటు బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంలో బ్రాహ్మణి కామెంట్స్ ఆకట్టుకున్నాయి. మంచి వాగ్దాటి తో ఆమె చేసిన వ్యాఖ్యలు టిడిపి శ్రేణుల అభిమానాన్ని చురగొన్నాయి. అందుకే ఆమె సేవలను పార్టీ వినియోగించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా.. బ్రాహ్మణి సేవలను మాత్రం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉపయోగించుకోవాలని టిడిపి శ్రేణులు బలంగా కోరుతున్నాయి. అదే సమయంలో నిలిచిపోయిన లోకేష్ పాదయాత్రను.. ఆమెతో పూర్తి చేయిస్తే పార్టీకి మంచి మైలేజ్ వస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.