Nagoba Jathara : ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా సంబురం మొదలైంది. ఆచార సంప్రదాయాలు పాటిస్తూ మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించడంతో జాతర ఘట్టం ప్రారంభమైంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులతో కేస్లాపూర్ భక్త జనసంద్రంగా మారింది. ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.

ఉదయం నుంచే ప్రత్యేక పూజలు..
నాగోబా ఆలయ సమీపంలోని వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్దలు(పటేళ్లు) శనివారం ఉదయం నుంచి సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామున 84 మందికి తూమ్ (చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి నాలుగుసార్లు సంప్రదాయ వాయిద్యాలు వాయించారు. నాగేంద్రుడి విగ్రహంతో ఆలయానికి చేరుకున్నారు. సిరికొండ నుంచి తెప్పించిన కుండలకు మెస్రం పెద్దలు పూజలు చేశారు. వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు తమ వంశ పెద్దలు, పూజారులకు పాదాభివందనం చేశారు. నాయక్‌పాడ్ నుంచి మట్టి కుండలు స్వీకరించారు.
అర్ధరాత్రి మహాభిషేకం..
మెస్రం వంశీయులు ఈనెల 1న గంగాజలం కోసం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. జన్నారం మండలం కలమడుగు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో శనివారం అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించారు. అనంతరం భేటింగ్ కాని మెస్రం వంశ కోడళ్లతో సతీదేవతల పూజలు చేయించారు. తర్వాత వారిని మెస్రం వంశీయులకు పరిచయం చేస్తూ(భేటింగ్) నిర్వహించారు.
కేంద్రమంత్రి నాగోబా దర్శనం..
నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఆదివారం రానున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా కేస్లాలపూర్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు కేస్లాపూర్ చేరుకుంటారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబాను దర్శించుకుంటారు. తర్వాత గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక నేపథ్యంలో అధికార యంత్రాంగంతోపాటు బీజేపీ నాయకులు పెద్దెత్తున ఏర్పాట్లు చేశారు.